శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 16, 2020 , 19:56:20

సిబ్బంది నిర్లక్ష్యం.. మార్చురీలో అస్థిపంజరంగా మారిన శవం!

సిబ్బంది నిర్లక్ష్యం.. మార్చురీలో అస్థిపంజరంగా మారిన శవం!

ఇండోర్‌ : ఇండోర్‌లోని అతిపెద్ద ప్రభుత్వ దవాఖాన నుంచి ఒక నిర్లక్ష్య సంఘటన వెలుగులోకి వచ్చింది. మార్చురీలో నెలల తరబడి స్ట్రెచర్ మీద ఉన్నశవం కాస్తా అస్థిపంజరం అయ్యింది. ఈ విషయం స్థానికంగా చర్చానీయాంశంగా మారిన తరువాత దవాఖాన సిబ్బంది కంపు కొడుతున్న అస్థిపంజరాన్ని అక్కడి నుంచి తొలగించారు.

మధ్యప్రదేశ్‌ రాష్ట్రం ఇండోర్‌లోని అతిపెద్ద ఎంవై దవాఖానలోని మార్చురీలో ఓ శవాన్ని రిఫ్రిజిరేటర్‌లో పెట్టకుండా అలాగే స్ట్రెచర్‌ మీదే వదిలేశారు. దుర్వాసన వస్తున్నప్పటికీ మృతదేహాన్ని ఏ ఒక్కరూ పట్టించుకోలేదు. నెలలు గడిచిన తరువాత మృతదేహం కుళ్లి, కుచించుకుపోయి అస్థిపంజంరంగా మారింది. తరువాత కూడా 15 నుంచి 20 రోజుల వరకు ఎవరూ గుర్తించలేదు. అయితే ఈ మృతదేహం ఎవరిదీ.. దాన్ని ఎవరు అక్కడ ఉంచారు..? అనే విషయం తెలియరాలేదు. ఈ ఘటనపై దవాఖానలో ఏ ఒక్కరూ స్పందించడం లేదు కూడా. తరువాత సిబ్బంది అస్థిపంజరాన్ని సోమవారం అక్కడి నుంచి తొలగించింది. ఈ ఘటనపై క్యాజువాలిటీ ఇన్‌చార్జికి నోటీసులు జారీ చేసినట్లు దవాఖాన పరిపాలన వ్యవస్థ పేర్కొంది. 

తెలియని మృతదేహం దవాఖానలో ఉంటే మేము దాన్ని వారం పాటు ఉంచుతామని ఎంవై దవాఖాన సూపరిండెంట్‌ పీఎస్‌ ఠాకూర్‌ తెలిపారు. తరువాత దాన్ని మునిసిపల్ కార్పొరేషన్‌కు అప్పగిస్తామన్నాడు. కానీ ఈ మృతదేమం చాలా రోజులుగా ఇక్కడ ఉండి అస్థిపంజరం అయ్యింది. ఇది ఎలా జరిగిందో తెలియడం లేదు.. దీనిపై వివరణ కోరుతూ మార్చురీ ఇన్‌చార్జికి నోటీసులు జారీ చేశామని, విచారణ తరువాత నిర్లక్ష్యం వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo