సోమవారం 18 జనవరి 2021
Crime - Dec 02, 2020 , 01:17:25

మందుపాతర పేల్చిన మావోయిస్టులు

మందుపాతర పేల్చిన మావోయిస్టులు

  • బీజాపూర్‌లో ఇద్దరు పౌరులకు గాయాలు

కొత్తగూడెం క్రైం: ఛత్తీస్‌గఢ్‌ ఏజెన్సీలో మావోయిస్టులు దాడులకు పాల్పడుతున్నారు. బుధవారం నుంచి పీపుల్స్‌ గెరిల్లా లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్జీఏ) వారోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో మావోయిస్టులు హింసాత్మక ఘటనలకు తెరలేపుతున్నారు. మంగళవారం ఓ మందుపాతర పేల్చగా ఇద్దరు సాధారణ పౌరులు గాయపడ్డారు. బీజాపూర్‌ బాసగూడ - తరేం మార్గంలో మంగళవారం ఓ కారు ప్రయాణికులతో వెళ్తుండగా.. రాజపేట్‌ సమీపానికి చేరుకోగానే ఒక్కసారిగా రహదారిపై మందుపాతర పేలింది. కారులో ఉన్న మహమ్మద్‌ ఇక్బాల్‌, బల్‌రామ్‌ ప్రధాన్‌ అనే ఇద్దరు పౌరులు గాయపడ్డారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను బీజాపూర్‌ దవాఖానకు తరలించినట్లు ఎస్పీ కమలోచన్‌ కశ్యప్‌ తెలిపారు.

దంతెవాడలో హత్య..

కాగా ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ సర్పంచ్‌ భర్త సంతోష్‌ కశ్యప్‌ను మావోయిస్టులు సోమవారం రాత్రి అపహరించారు. మంగళవారం ఉదయం పట్ట ణ సమీపంలో సంతోష్‌ మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. మావోయిస్టులు హత్యచేసినట్లుగా మృతుని కుటుంబ సభ్యులు భావిస్తున్నారు. పోలీస్‌ ఇన్ఫార్మర్‌ అనే నెపంతోనే మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తున్నది.