బుధవారం 27 జనవరి 2021
Crime - Dec 09, 2020 , 17:16:56

గంజాయి మత్తులో వ్యక్తిపై కత్తితో దాడి..

గంజాయి మత్తులో వ్యక్తిపై కత్తితో దాడి..

హైదరాబాద్‌ ‌: గంజాయి మత్తులో అకారణంగా ఓ వ్యక్తిపై కత్తితో దాడిచేసిన ఘటన నగరంలోని బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. కర్నాటకకు చెందిన  కల్యాణ్‌కుమార్‌ (35) బంజారాహిల్స్‌ రోడ్‌ నెం 10లోని సింగాడకుంటలో భార్య జే.పావనితో కలిసి నివాసం ఉంటున్నాడు. స్థానికంగా హెయిర్‌ సెలూన్‌లో పనిచేస్తున్న కల్యాణ్‌కుమార్‌ మంగళవారం రాత్రి 9గంటల ప్రాంతంలో ఇంటికి బయలుదేరాడు. 

ఇంట్లో ఉంటున్న పిల్లల కోసం బజ్జీలు కొనుక్కునేందుకు మూర్తి కిరాణా స్టోర్‌వద్ద బండివద్దకు వెళ్లాడు. అప్పటికే అక్కడ నలుగురు యువకులు గంజాయి మత్తులో గొడవపడుతున్నారు. వారిని చూస్తూ నిల్చున్న కల్యాణ్‌కుమార్‌తో బబ్లూ అనే యువకుడు గొడవకు దిగాడు. తమవైపు ఎందుకు చూస్తున్నావంటూ ఆగ్రహంతో వచ్చి మరో ముగ్గురితో కలిసి  కల్యాణ్‌కుమార్‌ మీద దాడి చేశారు. తనవద్దనున్న కత్తితో బబ్లూ కడుపులో పొడవడంతో కల్యాణ్‌కుమార్‌ కుప్పకూలిపోయాడు.

సమాచారం అందుకున్న కల్యాణ్‌కుమార్‌ భార్య పావని అక్కడకు చేరుకుని భర్తను ఉస్మానియా దవాఖానకు తరలించారు. సంఘటనపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్‌ ఎస్‌ఐ ఉదయ్‌కుమార్‌ ఉస్మానియా దవాఖానకు వెళ్లి బాధితుడికి సర్జరీ చేయించారు. అతడికి ప్రాణాపాయం తప్పిందని వైద్యులు వెల్లడించారు. ఘటనకు కారణమైన బబ్లూతో పాటు అతడి స్నేహితులపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన పో లీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు. 


logo