గురువారం 21 జనవరి 2021
Crime - Sep 30, 2020 , 12:34:50

16 ఏళ్ల బాలిక‌ను 3 వేల‌కు అమ్మిన తండ్రి

16 ఏళ్ల బాలిక‌ను 3 వేల‌కు అమ్మిన తండ్రి

రాయ్‌పూర్ : ఇది ఘోరం.. కంటికి రెప్ప‌లా కాపాడుకోవాల్సిన తండ్రే.. త‌న కూతురును అమ్మేశాడు. అది కూడా అక్ష‌రాల మూడు వేల రూపాయాల‌కు. ఈ ఘ‌ట‌న రెండేళ్ల క్రితం చోటు చేసుకోగా ఇప్పుడు వెలుగు చూసింది. 

ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని రాయ్‌ఘ‌డ్ జిల్లాకు చెందిన ఓ వ్య‌క్తి త‌న కుమార్తెను రెండేళ్ల క్రితం 21 ఏళ్ల యువ‌కుడికి రూ. 3 వేల‌కు అమ్మేశాడు. అప్పుడామె వ‌య‌సు 16 సంవ‌త్స‌రాలు. ఇంట్లో ప‌ని చేయించుకునేందుకని చెప్పి ఆ బాలిక‌ను యువ‌కుడు తీసుకెళ్లాడు. కానీ ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేసి హింసించాడు. ఈ క్ర‌మంలో బాధితురాలు కొన్ని నెల‌ల క్రితం గ‌ర్భం ధ‌రించింది. దీంతో ఆ యువ‌కుడు.. ఆమెను న‌డిరోడ్డుపై వ‌దిలేశాడు. ఆమెతో డ‌బ్బు లేక‌పోవ‌డంతో వీధుల్లో తిరుగుతూ జీవ‌నం సాగించింది. కొవిడ్ వ్యాప్తి నేప‌థ్యంలో ఆమెను ఎవ‌రూ ఆదుకోలేదు. మొత్తానికి ఈ ఏడాది మే నెల‌లో బాధితురాలిని మ‌హిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు చేర‌దీశారు. ఆ త‌ర్వాత ఆమె పండంటి బిడ్డ‌కు జ‌న్మ‌నిచ్చింది. నెల రోజుల క్రితం ఆమెను బిలాస్‌పూర్‌లోని సఖి కేంద్రానికి త‌ర‌లించారు.

త‌న‌కు జ‌రిగిన ఘోర అవ‌మానాన్ని స‌ఖి కేంద్ర నిర్వాహ‌కుల‌కు బాధితురాలు చెప్పింది. రెండేళ్ల క్రితం త‌న అమ్మ చ‌నిపోయిన‌ప్పుడు.. త‌న‌ను ఓ యువ‌కుడికి రూ. 3 వేల‌కు నాన్న అమ్మాడు. తాను కేవ‌లం ఇంటి ప‌ని చేయిస్తాన‌ని చెప్పి త‌న‌ను ఆ యువ‌కుడు తీసుకెళ్లాడు. కానీ త‌న‌పై అనేక‌సార్లు అత్యాచారం చేశాడు. చివ‌ర‌కు గ‌ర్భం వ‌చ్చాక రోడ్డుపై వ‌దిలేసి వెళ్లిపోయాడు అని చెబుతూ బాధితురాలి క‌న్నీరు పెట్టుకుంది.

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. యువ‌కుడిపై పోక్సో చ‌ట్టం కింద కేసు న‌మోదు చేశారు. logo