శనివారం 23 జనవరి 2021
Crime - Nov 06, 2020 , 18:35:36

ట్రాఫిక్‌ పోలీస్‌ను కారుపై ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌ అరెస్ట్‌

ట్రాఫిక్‌ పోలీస్‌ను కారుపై ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌ అరెస్ట్‌

ముంబై: ఒక ట్రాఫిక్‌ పోలీస్‌ను కారుపై కిలోమీటరు దూరం వరకు ఈడ్చుకెళ్లిన డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహారాష్ట్రలోని పూణెలో ఈ ఘటన జరిగింది. ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ అబాసాహెబ్ సావంత్ ఇతర సిబ్బందితో కలిసి చిన్చ్‌వాడలోని అహింసా చౌక్ వద్ద గురువారం సాయంత్రం విధులు నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారితోపాటు మాస్కులు ధరించని వారికి జరిమానాలు విధిస్తున్నారు. ఒక కారులో డ్రైవర్‌ యువరాజ్ హనువతే (49)తోపాటు మరో వ్యక్తి మాస్కులు ధరించకపోవడాన్ని గమనించారు. ఆ కారును ఆపేందుకు ట్రాఫిక్‌ పోలీసులు ప్రయత్నించారు. 

అయితే తప్పించుకునేందుకు కారును డ్రైవర్‌ యువరాజ్‌ వేగంగా ముందుకు నడిపాడు.  దీంతో కారు ముందున్న ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సావంత్‌ బోనెట్‌పై పడి దానిని గట్టిగా పట్టుకున్నారు. మరోవైపు డ్రైవర్‌ యువరాజ్‌ కారును నిలుపకపోగా అలాగే ఒక కిలోమీటరు వరకు నడిపాడు. రోడ్డుపై వెళ్తున్న ఇతర వాహనదారులు గమనించి ఆ కారును నిలువరించారు. ఈ ఘటనలో ట్రాఫిక్‌ కానిస్టేబుల్‌ సావంత్‌ కాలికి గాయమైంది. కారు డ్రైవర్‌ యువరాజ్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. హత్యాయత్నం, ప్రభుత్వ ఉద్యోగి విధులను అడ్డుకోవడం, దాడి చేయడం, విధులకు ఆటకం కలిగించడం వంటి సెక్షన్ల ఆధారంగా అతడిపై కేసు నమోదు చేశారు. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo