మంగళవారం 26 జనవరి 2021
Crime - Jan 13, 2021 , 11:07:43

తండ్రిని చంపి త‌మ్ముడి చేతిలో హ‌త‌మైన అన్న‌!

తండ్రిని చంపి త‌మ్ముడి చేతిలో హ‌త‌మైన అన్న‌!

ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్‌: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లాలో ఓ వ్య‌క్తి దారుణ‌హ‌త్య‌కు గుర‌య్యాడు. కుటుంబ త‌గాదాల కార‌ణంగా సొంత సోద‌రుడే అత‌డిని మ‌రో ముగ్గురితో క‌లిసి దారుణంగా హ‌త‌మార్చాడు. జిల్లాలోని దుల్లా ఖేరీ గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ముజ‌ఫ‌ర్‌న‌గ‌ర్ జిల్లా జహంగీర్‌పూర్ గ్రామానికి చెందిన ప‌ద‌మ్ సింగ్‌కు సంజ‌య్, బ‌బ్లూ అనే ఇద్ద‌రు కొడుకులు ఉన్నారు. 

ఈ నెల 6న ప‌‌ద‌మ్‌సింగ్ అనుమానాస్ప‌ద స్థితిలో మృతిచెందాడు. ఈ క్ర‌మంలో వారం కూడా తిర‌గ‌క‌ముందే అత‌ని పెద్ద కొడుకు సంజ‌య్ (34) ఊరిబ‌య‌ట పంట పొలాల్లో శ‌వ‌మై క‌నిపించాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్ట‌గా సంజ‌య్ త‌మ్ముడు బ‌బ్లూయే ఈ హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు వెల్ల‌డైంది. ర‌వీంద‌ర్‌, లోకేంద్ర‌, దీపు అనే మ‌రో ముగ్గురు వ్య‌క్తుల‌తో క‌లిసి ఈ హ‌త్య‌కు పాల్ప‌డిన‌ట్లు బ‌బ్లూ అంగీక‌రించాడు. 

కుటుంబ క‌లహాల నేప‌థ్యంలో త‌న సోద‌రుడు సంజ‌యే త‌మ‌‌ తండ్రిని హ‌త‌మార్చాడ‌ని, అందుకు ప్ర‌తీకారంగానే తాను త‌న సోద‌రుడిని హ‌త్య చేశాన‌ని బ‌బ్లూ వెల్ల‌డించాడు. పోలీసులు ఇప్ప‌టికే ప్ర‌ధాన నిందితుడు బ‌బ్లూతోపాటు ర‌వీంద‌ర్‌ను అరెస్ట్ చేశారు. ప‌రారీలో ఉన్న మ‌రో ఇద్ద‌రి కోసం గాలిస్తున్నారు.    ‌  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo