శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Sep 10, 2020 , 12:57:56

వృద్ధురాలిని హ‌త‌మార్చి.. శ‌వాన్ని పొద‌ల్లో దాచి

వృద్ధురాలిని హ‌త‌మార్చి.. శ‌వాన్ని పొద‌ల్లో దాచి

ముంబై: మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్ జిల్లాలో దారుణం జ‌రిగింది. ఓ వ్య‌క్తి 65 ఏండ్ల వృద్ధురాలిని హ‌త్య‌చేసి పొద‌ల్లో దాచిపెట్టాడు. అనంత‌రం పోలీసుల విచార‌ణ‌లో నిజం బ‌య‌ట‌పెట్టి క‌ట‌క‌టాల పాల‌య్యాడు. పాల్ఘ‌ర్ జిల్లాలోని వ‌డ త‌హ‌సీల్ ఖ‌డివాలి గ్రామంలో ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. లాహూ కాలూ ఖేనీ (45), ర‌ఖ్మాబాయ్ గావ్టే (65) ఖ‌డివాలీ గ్రామంలోని ప‌క్క‌ప‌క్క ఇండ్ల‌లో నివ‌సిస్తున్నారు.

గ్రామ స‌మీపంలో వారి చెల‌క‌లు కూడా ప‌క్క‌ప‌క్క‌నే ఉన్నాయి. దీంతో ఖేనీ ప‌శువులు త‌ర‌చూ ర‌ఖ్మాబాయ్ చెల‌క‌లోప‌డి పంట‌ను నాశనం చేసేవి. ఈ విష‌యంలో ఇద్ద‌రి మ‌ధ్య త‌ర‌చూ గొడ‌వ‌లు జ‌రుగుతుండేవి. ఈ నేప‌థ్యంలో బుధ‌వారం మ‌రోసారి ర‌ఖ్మాబాయ్‌తో గొడ‌వ‌ప‌డ్డ ఖేని ఆమె మీద‌కు రాయి విసిరాడు. ఆ రాయి త‌ల‌కు బ‌లంగా త‌గుల‌డంతో ర‌ఖ్మాబాయ్ అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయింది. దీంతో ఖేని వారి  చెల‌క‌ల ప‌క్క‌నే ఉన్న పొద‌ల్లో ర‌ఖ్మాబాయ్ మృత‌దేహాన్ని దాచి ఏమీ తెలియ‌న‌ట్లుగా ఉన్నాడు.

రాత్రి అయినా ర‌ఖ్మాబాయ్ ఇంటికి రాక‌పోవ‌డంతో కుటుంబ‌స‌భ్యులు పోలీసుల‌కు ఫిర్యాదు  చేశారు. కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టిన పోలీసులు ఖేనీని అనుమానించి గ‌ట్టిగా ప్ర‌శ్నించ‌డంతో నిజం ఒప్పుకున్నాడు. పొద‌ల్లో ర‌ఖ్మాబాయ్ మృత‌దేహాన్ని చూపించాడు. పోలీసులు మృత‌దేహాన్ని పోస్టుమార్టానికి త‌ర‌లించి, ఖేనీని అరెస్ట్‌చేశారు.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo