సోమవారం 08 మార్చి 2021
Crime - Jan 28, 2021 , 13:43:14

సోషల్‌ మీడియా ఖాతాలు హ్యాక్‌ : 400 మంది బాలికలకు బెదిరింపులు

సోషల్‌ మీడియా ఖాతాలు హ్యాక్‌ : 400 మంది బాలికలకు బెదిరింపులు

లక్నో : ఓ వ్యక్తి ఏకంగా 400 మంది బాలికల సోషల్‌ మీడియా ఖాతాలను హ్యాక్‌ చేసి డబ్బుల కోసం వారిని బ్లాక్‌మెయిల్‌ చేసిన ఉదంతం యూపీలో వెలుగుచూసింది. ఓ బాధితురాలి ఫిర్యాదుపై లక్నో సైబర్‌ క్రైమ్‌ పోలీసులు నిందితుడు వినీత్‌ మిశ్రాను అదుపులోకి తీసుకున్నారు. తన ఫేస్‌బుక్‌ ఖాతాను హ్యాక్‌ చేసి ఓ వ్యక్తి అభ్యంతరకర ఫోటోలను చూపి డబ్బులు ఇవ్వాలని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్నాడని ఇటీవల ఓ బాలిక పిర్యాదు చేసిందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడి నుంచి షాకింగ్‌ విషయాలను రాబట్టారు. ఎనిమిదో తరగతి మధ్యలోనే స్కూల్‌ను వదిలివేసిన మిశ్రా ఓ యూట్యూబ్‌ వీడియోలో బాలికలను బ్లాక్‌మెయిల్‌ చేసే ట్రిక్‌ గురించి తెలుసుకున్నాడని విచారణలో వెల్లడైంది.

మీ అసభ్య చిత్రాలు ఈ లింక్‌లో ఉన్నాయని వివిధ సోషల్‌ మీడియా వేదికలపై బాలికలకు మిశ్రా లింక్‌ పంపేవాడు. లింక్‌ను ఓపెన్‌ చేసిన బాలికలు అక్కడ అడిగిన ఈమెయిల్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ ఇవ్వడంతో వారి సోషల్‌ మీడియా ఖాతాలను నిందితుడు యాక్సెస్‌ చేసేవాడని పోలీసులు తెలిపారు. ఈ ఖాతాల నుంచి మిశ్రా వారి అభ్యంతరకర ఫోటోలు, వీడియో, ఛాట్స్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని డబ్బులు ఇవ్వాలంటూ బాధిత బాలికలను బ్లాక్‌మెయిల్‌ చేసేవాడు. డబ్బులు ఇవ్వకుంటే అభ్యంతరకర కంటెంట్‌ను సోషల్‌ మీడియాలో వైరల్‌ చేస్తానని బెదిరించేవాడు. నిందితుడి ల్యాప్‌టాప్‌ను సీజ్‌ చేసిన పోలీసులు ఫోరెన్సిక్‌ పరిశీలన కోసం పంపారు. 

VIDEOS

logo