శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Crime - Feb 23, 2021 , 18:10:18

‘రూ 5 పెట్టుబడితో 500 బ్యాంక్‌ ఖాతాలను హ్యాక్‌ చేశాడు’

‘రూ 5 పెట్టుబడితో 500 బ్యాంక్‌ ఖాతాలను హ్యాక్‌ చేశాడు’

లక్నో : ఫింగర్‌ప్రింట్‌ క్లోనింగ్‌ టెక్నాలజీతో 500 బ్యాంకు ఖాతాలను హ్యాక్‌ చేసి పలు ప్రభుత్వ పథకాల లబ్ధిదారులను మోసం చేసిన కేటుగాళ్ల గుట్టును యూపీకి చెందిన షహజన్‌పూర్‌ పోలీసులు రట్టు చేశారు. ఆన్‌లైన్‌లో క్లోనింగ్‌ టెక్నిక్‌ను నేర్చుకుని ఈ మోసానికి తెరలేపానని కేసులో ప్రధాన నిందితుడు గౌరవ్‌ వెల్లడించాడని పోలీసులు చెప్పారు. కేవలం ఐదు రూపాయల ఖర్చుతో గ్లూ-గన్‌, టేప్‌ సాయంతో గౌరవ్‌ ఈ రాకెట్‌కు పాల్పడ్డాడు. ఈ కేసులో గౌరవ్‌ సహా ఆరుగురు వ్యక్తులను అరెస్ట్‌ చేసిన పోలీసులు మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు. నిందితుల నుంచి బాధితుల క్లోన్డ్‌ ఫింగర్‌ప్రింట్స్‌, బ్యాంకు పాస్‌బుక్‌లు, ఆధార్‌ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రంలో ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న ముఠాల పనిపట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

పీఎం కిసాన్‌ యోజన, వృద్ధాప్య పెన్షన్‌ వంటి ప్రభుత్వ పథకాల సొమ్ము తమ ఖాతాల్లో జమ కావడం లేదని పలువురు లబ్ధిదారులు ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం బయటపడింది. జలాలాబాద్‌ ప్రాంతం నుంచి ఈ ముఠా చేపడుతున్న క్లోనింగ్‌ దందా పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. ప్రభుత్వ పథకాల సొమ్ము లబ్ధిదారుల ఖాతాల్లో పడుతున్నా మోసగాళ్లు బ్యాంకు మిత్రాస్‌ నిర్వహించే జన్‌ సువిధ కేంద్రాల నుంచి నగదును విత్‌డ్రా చేస్తున్నారు. మోసగాళ్లకు శివరాం, సునీల్‌ త్రిపాఠి, దేవ్‌ వ్రత్‌, సందీప్‌ సింగ్‌, సెహ్రన్‌, హుకుం సింగ్‌ అనే బ్యాంకు మిత్రలు సహకరించినట్టు వెల్లడైంది. బ్యాంక్‌ ఖాతాలను హ్యాక్‌ చేసి బయోమెట్రిక్స్‌కు సరిపోయేలా క్లోన్డ్‌ ఫింగర్‌ప్రింట్స్‌ను వాడేవారని, నిరక్షరాస్యులైన బాధితులను టార్గెట్‌ చేసుకుని వారి ఖాతాల్లో సొమ్ము లూటీ చేసే వారని తేలింది. ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఫింగర్‌ప్రింట్‌ టెక్నిక్‌ను పసిగట్టి మోసాలకు పాల్పడే వారి ఆట కట్టిస్తామని, ఇలాంటి కంటెంట్‌ను తొలగించేలా చర్యలు చేపడతామని ఐజీ రాజేష్ పాండే పేర్కొన్నారు. 

VIDEOS

logo