శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Aug 04, 2020 , 20:16:03

నకిలీ చెక్కుతో పోర్స్చే కారుకు గాలం

నకిలీ చెక్కుతో పోర్స్చే కారుకు గాలం

డెస్టిన్: ఇంట్లో కంప్యూటర్ నుంచి ముద్రించిన నకిలీ చెక్కుతో విలువైన పోర్స్చే కారును కొన్న ఫ్లోరిడాకు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఇతగాడు లగ్జరీ గడియారాలు కూడా కొనేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తున్నది. 

ఫ్లోరిడాకు చెందిన కేసీ విలియం కెల్లీ లగ్జరీ కారు కొనేందుకు గత నెల 27 న డెస్టిన్ లోని పోర్స్చే డీలర్ వద్ద దర్జాగా వెళ్లాడు. ఇంట్లో కంప్యూటర్ సాయంతో ముద్రించిన నకిలీ చెక్కును ఇచ్చి పోర్స్చే డీలర్ ను నమ్మించాడు. అయితే చెక్కును బ్యాంకుకు తీసుకెళ్లగా నకిలీదని బ్యాంకు అధికారులు తేల్చడంతో మోసపోయినట్లు గుర్తించి సదరు పోర్స్చే కారు డీలర్ వాల్టన్ కౌంటీ షెరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కారు విలువ దాదాపు రూ.కోటి వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు. నకిలీ చెక్కుతో పొర్స్చే కారును తీసుకెళ్లిన విలియం... అవే నకిలీ చెక్కుల సాయంతో విలువైన మూడు రోలెక్స్ గడియారాలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించాడు. అయితే, సదరు దుకాణం యజమాని చెక్కు బ్యాంకు అకౌంట్లో పడేంతవరకు రోలెక్స్ వాచులు ఇవ్వకుండా నిలువరించాడు. విలియం కెల్లి పలు నకిలీ చెక్ లను వినియోగించినట్లు పోలీసులు గుర్తించారు. 

విలియం కెల్లీ తన ఇంట్లో ఉన్న కంప్యూటర్ నుండి చెక్కులను ముద్రించినట్లు ఒప్పుకున్నాడు. అతడ్ని కోర్టులో హాజరుపర్చగా 10,000 డాలర్ల బాండ్లపై విడుదల చేశారు. ఈ కేసు తదుపరి విచారణ సెప్టెంబర్ 22 కు వాయిదా వేశారు.


logo