మంగళవారం 19 జనవరి 2021
Crime - Nov 16, 2020 , 15:07:32

పబ్లిక్ ప్లేస్‌లో మూత్ర విస‌ర్జ‌న‌ చేశాడ‌ని కొట్టిచంపారు!

పబ్లిక్ ప్లేస్‌లో మూత్ర విస‌ర్జ‌న‌ చేశాడ‌ని కొట్టిచంపారు!

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం బ‌హ్రెయిక్ జిల్లాలో దారుణం జ‌రిగింది. త‌మ ఇండ్ల ఆవ‌ర‌ణ‌లో మూత్ర విస‌ర్జ‌ణ చేశాడ‌ని కొంద‌రు వ్య‌క్తులు సుహెయిల్ అనే యువ‌కుడిని కొట్టి చంపారు. జిల్లాలోని ఖైరి డుకోలి గ్రామంలో ఆదివారం రాత్రి ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం రాత్రి సుహెయిల్ అనే యువ‌కుడు ఖైరి డుకోలి గ్రామం మీదుగా వెళ్తూ ఒకచోట మూత్ర‌విస‌ర్జ‌న చేశాడు. ఇది గ‌మ‌నించిన రామ్ మూర‌త్ అనే మ‌రో యువకుడు త‌మ ఇండ్ల ముందు ఎందుకు మూత్ర విస‌ర్జ‌న చేశావంటూ నిల‌దీశాడు. 

దాంతో ఇద్ద‌రి మ‌ధ్య గొడ‌వ మొద‌లైంది. ఈ గొడ‌వ మరింత పెద్ద‌ది కావ‌డంతో ఇరుగ‌పొరుగు అక్క‌డికి చేరుకున్నారు. రామ్‌మూర‌త్‌తోపాటు ఆత్మారామ్‌, రాంపాల్‌, స‌నేహి, మంజీత్ అనే యువ‌కులు కలిసి సుహెయిల్‌ను తీవ్రంగా కొట్టారు. క‌ర్ర‌ల‌తో కొట్ట‌డంతో అత‌ను ఆప‌స్మార‌క స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి తండ్రి చింతారామ్ ఫిర్యాదు మేర‌కు పోలీసులు ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.        

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.