సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jun 25, 2020 , 15:27:20

భార్య‌తో క‌లిసి వాకింగ్.. భ‌ర్త హ‌త్య‌

భార్య‌తో క‌లిసి వాకింగ్.. భ‌ర్త హ‌త్య‌

పంజాబ్ : ఓ వ్య‌క్తి త‌న తండ్రి, భార్య‌తో క‌లిసి వాకింగ్ చేస్తున్నాడు. అటుగా వ‌చ్చిన తాగుబోతులు.. వారిని అడ్డుకుని ఈ స‌మ‌యంలో వాకింగ్ ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఈ వివాదం ఆ వ్య‌క్తి హ‌త్య దాకా దారి తీసింది. ఈ ఘ‌ట‌న పంజాబ్ లోని ప‌టియాలా జిల్లాలో సోమ‌వారం రాత్రి చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది.

బీహార్ కు చెందిన మిథున్ ప‌టేల్(21) త‌న తండ్రి, భార్య‌తో క‌లిసి ప‌టియాలాలో నివాస‌ముంటున్నాడు. అయితే సోమ‌వారం రాత్రి 12:15 గంట‌ల స‌మ‌యంలో ఈ ముగ్గురు.. స్థానికంగా ఉన్న రోడ్డుపై వాకింగ్ చేస్తున్నారు. అటుగా వ‌చ్చిన తాగుబోతులు.. అమ్మాయితో క‌లిసి ఈ స‌మ‌యంలో తిర‌గ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఆమె త‌న భార్య అని చెప్తున్న క్ర‌మంలోనే అత‌నిపై మ‌ద్యం బాబులు బీర్ బాటిళ్ల‌తో దాడి చేశారు. అంత‌టితో ఆగ‌కుండా రాళ్లు, ఇటుక‌ల‌తో దాడి చేయ‌డంతో తీవ్రంగా గాయ‌ప‌డ్డాడు. 

ఆ త‌ర్వాత అటు నుంచి దుండ‌గులు త‌ప్పించుకున్నారు. ఇక గాయ‌ప‌డిన మిథున్ ను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించాడు తండ్రి. చికిత్స పొందుతూ మిథున్ ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేర‌కు కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుల‌ను జ‌గ‌న్మోహ‌న్ సింగ్, భూపీంద‌ర్ సింగ్ గా పోలీసులు గుర్తించారు.  నిందితుల‌ను త్వ‌ర‌లోనే ప‌ట్టుకుంటామ‌న్నారు పోలీసులు.


logo