శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jun 23, 2020 , 17:20:44

భార్య చితిపై దూకేందుకు భర్త ప్రయత్నం

భార్య చితిపై దూకేందుకు భర్త ప్రయత్నం

ముంబై : భార్యను అమితంగా ప్రేమించిన ఓ యువకుడు.. ఆమె ఆత్మహత్య చేసుకోడంతో.. ఆమె చితిపైనే దూకి తనువు చాలించేందుకు సిద్ధపడ్డాడు. చితిపై నుంచి లాగి బంధువులు కాపాడినప్పటికీ ... ఆ పక్కనే ఉన్న బావిలో దూకి ఆత్మహత్య చేసుకొన్నాడు. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలోని గోండ్‌పిప్రి తహసీల్‌లోని భాంగ్రామ్ తలోధి గ్రామంలో ఈ విషాద సంఘటన సోమవారం జరిగింది.

కిషోర్ ఖాతిక్ అనే వ్యక్తి ఈ ఏడాది మార్చి 19 న రుచితా చిట్టావర్ ను వివాహం చేసుకున్నాడు. మూడు నెలల గర్భవతి అయిన రుచిత, అనారోగ్యంతో ఉన్న తన తల్లిని చూసేందుకు నాలుగు రోజుల క్రితం తల్లి ఇంటికి వెళ్ళింది. ఆమెను తిరిగి తీసుకురావడానికి కిషోర్ ఆదివారం తన అత్తమామల ఇంటికి చేరుకోగానే, రుచిత కనిపించకుండా పోయింది. అదే రోజు ఆమె మృతదేహం  ఇంటికి సమీపంలోని ఓ బావిలో పడివుండటం గుర్తించారు.  దుఃఖిస్తున్న కిషోర్, రుచితా కుటుంబం సోమవారం స్థానిక శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. చితికి నిప్పుపెట్టిన తర్వాత ఇంటికి తిరిగి వెళ్తుండగా పరుగున వచ్చిన కిషోర్‌.. భార్య చితిపై పడి ప్రాణాలు విడిచేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించిన కుటుంబసభ్యులు కిషోర్‌ను రక్షించారు. 

కిషోర్ మళ్ళీ పారిపోయి సమీపంలోని బావిలోకి దూకడంతో కుటుంబ సభ్యులు మళ్ళీ ఆశ్చర్యపోయారు. బావిలోకి తాడు విసిరి అతడిని రక్షించడానికి ప్రయత్నించారు. అయితే కిషో‌ర్‌ తాడు తీసుకోకుండా అందరూ చూస్తుండగానే ప్రాణాలు వదిలాడు. భార్యపై కిషోర్‌ అమిత ప్రేమను ఈ సంఘటన నిరూపించింది. తలోధిలోని పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, రుచిత ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందనే దానిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదు.


logo