ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 05, 2020 , 16:43:33

పెళ్లి సాకుతో యువ‌తుల‌ను మోసం చేస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌

పెళ్లి సాకుతో యువ‌తుల‌ను మోసం చేస్తున్న వ్య‌క్తి అరెస్ట్‌

న్యూ ఢిల్లీ : వివాహం సాకుతో పలువురు యువ‌తుల‌ను మోసం చేసిన కేసులో 38 ఏండ్ల వ్య‌క్తిని పోలీసులు శ‌నివారం అరెస్టు చేశారు. వివ‌రాలు..  ఢిల్లీకి చెందిన విశాల్ అలియాస్ మోహిత్ టోకాస్ తాను ఎన్ఆర్ఐగా చెప్పుకుంటూ మ్యాట్రిమోని సైట్‌లో యువ‌తుల‌తో ప‌రిచ‌యం చేసుకొని వారి వ‌ద్ద నుంచి సుమారు రూ.4.5 లక్షలు కాజేశాడు. 

మోస‌పోయిన వారిలో ఓ యువ‌తి కోట్ల ముబారక్‌పూర్ పోలీస్‌స్టేషన్‌లో మోహిత్‌పై ఫిర్యాదు చేయ‌డంతో ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. మోహిత్ త‌న‌తో ప‌రిచ‌యం పెంచుకొని పెళ్లి చేసుకుంటాన‌ని మాయ మాట‌లు చెప్పాడ‌ని.. అయితే మొద‌ట కొంత డ‌బ్బు అవ‌స‌రం ఉంద‌ని మోహిత్ అడ‌గ్గా త‌న బ్యాంకు ఖాతాలోని రూ.1,21,900ను అత‌డికి బ‌దిలీ చేసిన‌ట్లు యువ‌తి తెలిపింది.  ఆరువాత ఫోన్ స్విచ్ఆఫ్ చేసుకోవ‌డంతో మోస‌పోయాన‌ని గ్ర‌హించి పోలీసుల‌ను ఆశ్ర‌యించాన‌ని యువ‌తి ఫిర్యాదులో పేర్కొన్న‌ది. 

రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడి ఫోన్ నెంబ‌ర్ల‌ను తనిఖీ చేసి, నకిలీ ఐడీల‌తో నెంబ‌ర్లు తీసుకున్న‌ట్లు గుర్తించారు.  ఫిర్యాదుదారు డబ్బును బదిలీ చేసిన ఖాతాను పోలీసులు విశ్లేషించి, ఖాతాదారుడి ఒక మొబైల్ నెంబ‌ర్ దానితో అనుసంధానించ‌బ‌డి ఉంద‌ని క‌నుగొన్నారు. త‌ద్వారా అత‌డి అకౌంట్‌ను బ్లాక్ చేసి నిందితుడిని గురువారం ప‌ట్టుకున్న‌ట్లు  డిప్యూటీ పోలీస్ కమిషనర్ అతుల్ కుమార్ ఠాకూర్ తెలిపారు. గతంలో అత‌డి మోహిత్‌ అనేక మహిళలను పెళ్లి చేసుకుంటానని న‌మ్మించి మోసం చేసిన‌ట్లు విచార‌ణ‌లో ఒప్పుకున్నాడ‌ని ఠాకూర్ పేర్కొన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo