సోమవారం 25 జనవరి 2021
Crime - Dec 08, 2020 , 21:06:53

వ‌ర‌క‌ట్నం కేసులో త‌ల్లి, కొడుకుకు జైలు

వ‌ర‌క‌ట్నం కేసులో త‌ల్లి, కొడుకుకు జైలు

హైద‌రాబాద్ : వ‌ర‌క‌ట్నం కేసులో భ‌ర్త‌కు, అత‌ని త‌ల్లికి న్యాయ‌స్థానం ఏడు సంవ‌త్స‌రాల క‌ఠిన జైలు శిక్ష అదేవిధంగా చెరో రూ.6 వేలు జ‌రిమానాగా విధించింది. బాధితురాలు ఎస్. లీలావతి, ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణ జిల్లా నివాసి. 2015 అక్టోబర్‌లో న‌గ‌రంలోని మల్కాజ్‌గిరిలో నివసిస్తున్న ఎస్. శశికిరణ్ రెడ్డి (35) ను వివాహం చేసుకుంది. వివాహం సమయంలో లీలావతి తల్లిదండ్రులు నగదు, బంగారం, వ్యవసాయ భూమి, ఇతర వస్తువులను వరకట్నంగా ఇచ్చారు. వివాహం తరువాత ఈ జంట ఒక నెల మాత్రమే సంతోషంగా ఉంది. వెనువెంట‌నే అదనపు కట్నం కోసం లీలావతికి వేధింపులు ప్రారంభ‌మ‌య్యాయి. 2016 ఫిబ్ర‌వ‌రి నుంచి ఈ వేధింపులు మ‌రీ ఎక్కువ‌య్యాయి.

లీలావ‌తికి క‌నీసం ఆహారం కూడా పెట్ట‌కుండా వేధించేవారు. ఈ వేధింపుల‌ను భ‌రించ‌లేని ఆమె జూన్ 2016లో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేర‌కు మ‌ల్కాజ్‌గిరి పోలీసులు కేసు న‌మోదు చేసుకుని శ‌శికిర‌ణ్‌ను ఇత‌ని త‌ల్లి ఉషాను అరెస్టు చేశారు. కేసులో దోషుల‌కు శిక్ష‌ప‌డేలా చేసిన ద‌ర్యాప్తు అధికారుల‌ను, ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్‌, కోర్డు సిబ్బంది అధికారుల‌ను రాచ‌కొండ సీపీ మ‌హేశ్ భ‌గ‌వ‌త్ అభినందించారు. 


logo