లక్నో: కారులో మహిళపై కొందరు లైంగిక దాడికి ప్రయత్నించారు. ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో కారు నుంచి బయటకు తోసేశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో ఈ ఘటన జరిగింది. లక్నోకు చెందిన ఒక మహిళ కాన్పూర్‌లోని ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నది. నవాబ్‌గంజ్‌లోని అద్దె ఇంట్లో ఆమె నివసిస్తున్నది. కొన్ని నెలల కిందట ఫ్రెండ్ ద్వారా ఒక యువకుడు ఆమెకు పరిచయం అయ్యాడు. దీంతో వారిద్దరు తరుచుగా కలుసుకునేవారు. అయితే ఆ వ్యక్తికి మరొకరితో సంబంధం ఉన్నదని ఆమె తెలుసుకుంది. దీంతో అతడితో మాట్లాడం మానేసింది.
కాగా, శుక్రవారం ఆ యువకుడి స్నేహితుడు ఆ మహిళను పిలిచాడు. ఆ యువకుడి కారులో తాను కూర్చోగా డోర్‌ను అతడు లాక్ చేసినట్లు ఆమె తెలిపింది. కారు కదలగా లైట్లు ఆపేసి, మ్యూజిక్ సౌండ్ పెంచి తనపై లైంగిక దాడికి పాల్పడబోయినట్లు ఆరోపించింది. తాను ప్రతిఘటించడంతో ఆ యవకుడు, అతడి స్నేహితులు తనపై దాడి చేయడంతోపాటు గొంతు నులిమేందుకు యత్నించారని తెలిపింది.
ప్రతిఘటనను తట్టుకోలేక తనను కదులుతున్న కారు నుంచి జాజ్మౌ చెక్ పోస్ట్ దగ్గర హైవేపైకి తోసేసి పారిపోయారని పోలీసులకు చెప్పింది. అయితే జాబ్మౌ అవుట్ పోస్ట్ పోలీసులు తన ఫిర్యాదును తీసుకోలేదని, చమంగంజ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లమని చెప్పారని ఆమె ఆరోపించింది. రాత్రి వేళ వెతుక్కుంటూ చివరకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించింది.