బుధవారం 28 అక్టోబర్ 2020
Crime - Sep 22, 2020 , 13:22:16

ఆడా? మ‌గా?.. గ‌ర్భిణి క‌డుపు కోసిన భ‌ర్త‌

ఆడా? మ‌గా?.. గ‌ర్భిణి క‌డుపు కోసిన భ‌ర్త‌

ల‌క్నో : అత‌నికి అబ్బాయిని క‌నాల‌ని కోరిక ఉంది. కానీ అబ్బాయి పుట్ట‌డం లేదు. వ‌రుస‌గా ఐదుగురు అమ్మాయిలే పుట్టారు. త‌న‌కు కొడుకు పుట్ట‌డం లేద‌నే బాధతో.. ఆరోసారి గ‌ర్భం ధ‌రించిన భార్య ప‌ట్ల ఓ భ‌ర్త క్రూరంగా ప్ర‌వ‌ర్తించాడు. భార్య క‌డుపులో ఉన్న‌ది ఆడా? మ‌గా? అని తెలుసుకునేందుకు దారుణానికి పాల్ప‌డ్డాడు. భార్య క‌డుపును అత్యంత దారుణంగా కొడ‌వలితో కొసేశాడు. దీంతో క‌డుపులో ఉన్న బిడ్డ చ‌నిపోయింది. భార్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. ఈ దారుణ ఘ‌ట‌న ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బుదౌన్ జిల్లాలో శ‌నివారం చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

బుదౌన్ జిల్లాకు చెందిన ప‌న్నీలాల్ అనే వ్య‌క్తికి ఇప్ప‌టికే ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. ప‌న్నీలాల్ మగ బిడ్డ సంతానం కోసం వేచి చూస్తున్నాడు. అయితే ఆయ‌న భార్య ఆరోసారి గ‌ర్భం దాల్చింది. ఐదుగురు కుమార్తెలు కావ‌డంతో ఆయ‌న విసిగిపోయాడు. ఇప్పుడు కూడా ఆడ‌బిడ్డే పుడితే ఏంట‌ని త‌న‌కు తానే ఆందోళ‌న చెందాడు. ఈ క్ర‌మంలో క‌డుపులో ఉన్న బిడ్డ లింగ నిర్ధార‌ణ తెలుసుకునేందుకు ప‌న్నీలాల్ దారుణానికి పాల్ప‌డ్డాడు. ఇంట్లో ఉన్న కొడ‌వ‌లితో భార్య క‌డుపును కోసేశాడు. ఆమెకు తీవ్ర ర‌క్తస్రావం కావ‌డంతో అప‌స్మార‌క స్థితిలోకి వెళ్లిపోయింది. క‌డుపులో పెరుగుతున్న పండంటి మ‌గ‌బిడ్డ చ‌నిపోయాడు. 

ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. బిడ్డ మృతికి కార‌ణ‌మైన ప‌న్నీలాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు త‌ర‌లించారు. బాధితురాలు ఢిల్లీలోని ఓ ఆస్ప‌త్రిలో ఐసీయూలో చికిత్స పొందుతుంది. 


logo