గురుగ్రాం : బాలిక అభ్యంతరకర ఫోటోలను వైరల్ చేస్తానని బెదిరించి తుపాకీ గురిపెట్టి ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని పోలీసులు కటకటాల వెనక్కు నెట్టిన ఘటన హర్యానాలోని పల్వాల్ జిల్లాలో జరిగింది. జులై 20న జరిగిన ఈ దారుణ ఉదంతం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..నిందితుడు ఓ ముఖ్య విషయం మాట్లాడాలని తన ఫోన్ నెంబర్ తీసుకున్నాడని, ఆపై గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌కు పిలిపించి రహస్యంగా తన ఫోటోలు తీశాడని బాలిక ఆరోపించింది.
ఆ తర్వాత మరోసారి కలవాలని లేకుంటే ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తానని హెచ్చరించాడు. ఈ క్రమంలో జులై 20న కారులో గోడౌన్‌కు తీసుకువెళ్లి అక్కడ తుపాకీ గురిపెట్టి తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని నిందితుడు బెదిరించడంతో బాలిక మౌనం దాల్చింది. కుటుంబ సభ్యులకు ఇటీవల ఈ వ్యవహారం చెప్పడంతో వారు మహిళా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు సోమవారం గురుగ్రాంలో నిందితుడిని అరెస్ట్ చేశారు.