శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jun 16, 2020 , 09:44:50

పోలీసు హత్య.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించిన పీఎస్‌ ఇంచార్జి

పోలీసు హత్య.. యాక్సిడెంట్‌గా చిత్రీకరించిన పీఎస్‌ ఇంచార్జి

భోపాల్‌ : ఓ పోలీసును కొంతమంది దుండగులు హత్య చేశారు. పోలీసు హత్యను స్థానిక పోలీసు స్టేషన్‌ ఇంచార్జి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని సాత్నా జిల్లాలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 

నయాగన్‌ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న కానిస్టేబుల్‌ ప్రభాల్‌ ప్రతాప్‌ సింగ్‌.. ఆదివారం సాయంత్రం పాట్లా గ్రామానికి వెళ్లాడు. అక్కడ బ్లాక్‌ మార్కెట్‌లో డిజీల్‌ విక్రయిస్తున్న వారిని అడ్డగించాడు. దీంతో ప్రతాప్‌ సింగ్‌ను.. దుండగులు ట్రాక్టర్‌తో ఢీకొట్టి చంపారు. అయితే స్టేషన్‌ ఇంచార్జి ఆశీష్‌ ధృవ్‌ మాత్రం.. ప్రతాప్‌ హత్యను యాక్సిడెంట్‌గా చిత్రీకరించాడు. కానిస్టేబుల్‌ యాక్సిడెంట్‌లో చనిపోయినట్లు పోలీసు ఉన్నతాధికారులకు నివేదించాడు.

అయితే పోలీసులు పాట్లా గ్రామానికి వెళ్లి విచారణ చేయగా అసలు విషయం వెలుగు చూసింది. ప్రతాప్‌ను హత్య చేశారని పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆశీష్‌ ధృవ్‌ను విధుల నుంచి సస్పెండ్‌ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతాప్‌ హత్య కేసులో ఇద్దరు వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు. యూపీకి చెందిన ప్రమోద్‌ పటేల్‌, ధన్‌పాట్‌ పటేల్‌ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.


logo