బుధవారం 02 డిసెంబర్ 2020
Crime - Nov 22, 2020 , 21:30:30

ప్రేమజంట ఆత్మహత్య

ప్రేమజంట ఆత్మహత్య

మిడ్జిల్ : మహబూబ్ నగర్ జిల్లా మిడ్జిల్‌ మండలంలో విషాదం చోటు చేసుకుంది. ప్రేమించుకున్న ఇద్దరు మైనర్లు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డారు. వేముల గ్రామంలో ఆదివారం సాయంత్రం ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాలివి.. వేముల గ్రామానికి చెందిన శ్రీకాంత్‌ (19) ఇంటర్‌ చదివి చదువు మానేశాడు. అదేగ్రామానికి చెందిన అఖిల (15) ప్రస్తుతం మిడ్జిల్‌లోని ప్రైవేట్‌ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. ఇద్దరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు వేర్వేరు కులాలకు చెందిన వారు కావడంతో ఇంట్లో విషయం తెలిస్తే ఏం జరుగుతుందోనన్న భయంతో శనివారం ఇంట్లో నుంచి వెళ్లిపోయారు.

ఆదివారం ఉదయం అఖిల తల్లిదండ్రులు తమ కూతురు కనిపించడం లేదంటూ మిడ్జిల్‌ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. సాయంత్రం వేముల గ్రామశివారులోని ఓ రైతుకు చెందిన మామిడితోటలో పశువుల కాపర్లు ఇద్దరి మృతదేహాలను గుర్తించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తెలిసీతెలియని వయసులో.. క్షణికావేశంలో ఇద్దరు అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం రెండు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఇద్దరు తల్లులకు తీరని కడుపుకోతను మిగిల్చింది.  

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.