బుధవారం 30 సెప్టెంబర్ 2020
Crime - Aug 09, 2020 , 17:48:53

ప్రేమ జంట దారుణ హత్య....

ప్రేమ జంట దారుణ హత్య....

చెన్నై: ప్రియుడిని వదిలి రానని కూతురు తెగేసి చెప్పేయడంతో ఉన్మాదులుగా మారిన యువతి కుటుంబ సభ్యులు భయోత్పాతం సృష్టించారు. కత్తులతో స్వైరవిహారం చేశారు. తోడబుట్టిన చెల్లెలన్న కనీస కనికరం లేకుండా యువతిని కత్తితో పొడిచి చంపాడు అన్న. ఆమె కుటుంబ సభ్యులు తలుపులు బద్దలు కొట్టి మరీ ప్రియుడిని బయటికి లాక్కొచ్చి కిరాతకంగా హత్య చేశారు. శవాలు మాయం చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో కథ అడ్డం తిరిగింది. ఈ అమానుష ఘటన మహారాష్ట్రలో చోటుచేసుకుంది. ఔరంగాబాద్‌కి చెందిన నీరజ్ కుమార్(19), అదే కాలనీకి చెందిన అమృత కుమారి(18) ప్రేమించుకున్నారు. నీరజ్ సూరత్‌లో ఓ కంపెనీలో పనిచేసేవాడు. లాక్‌డౌన్ కారణంగా ఇంటికి వచ్చేశాడు.

అప్పటి నుంచి ఇద్దరూ తరచూ కలుసుకునేవారు. ఆ విషయం ఇంట్లో తెలిసిపోవడంతో అమృత ప్రియుడు నీరజ్ ఇంటికెళ్లింది. తిరిగి ఇంటికి వచ్చేందుకు నిరాకరించడంతో కుటుంబ సభ్యులు ఆగ్రహంతో రగిలిపోయారు. ఇంటికి వెళ్దామంటూ ఎంత బతిమిలాడినా వినిపించుకోకపోవడంతో కోపంతో ఊగిపోయిన ఆమె అన్న దారుణానికి ఒడిగట్టాడు. చెల్లెలిని ప్రియుడి ఇంటి నుంచి ఈడ్చుకొచ్చి కత్తితో పొడిచేశాడు. విచక్షణా రహితంగా కత్తితో దాడి చేయడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. ఇంతలో అక్కడికి చేరుకున్న యువతి కుటుంబ సభ్యులు ప్రియుడు నీరజ్‌ వైపు మళ్లారు. వారిని చూసిన నీరజ్ అక్కడి నుంచి పారిపోయే ప్రయత్నం చేశాడు. ఇంట్లోకి వెళ్లి గది తలుపులు వేసుకున్నాడు. ఆగ్రహంతో ఉన్న ప్రియురాలి కుటుంబ సభ్యులు తలుపులు బద్దలుకొట్టి లోపలికి ప్రవేశించారు. నీరజ్‌ని కత్తులతో పొడిచి కిరాతకంగా చంపేశారు.

ఇంత జరుగుతున్నా నీరజ్ కుటుంబ సభ్యులు అడ్డుకోవడానికి కూడా రాకపోవడం గమనార్హం. అనంతరం సాక్ష్యం లేకుండా చేసేందుకు యత్నించారు. ఇద్దరి శవాలను తీసుకెళ్లి సమీపంలోని కపాసియా గ్రామం వద్ద వాగు ఒడ్డున దహనం చేశారు. ఆ సమయంలో పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో దారుణం వెలుగులోకి వచ్చింది. మంటలను ఆర్పివేయించి కాలిపోతున్న శవాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అప్పటికే నీరజ్, అమృత శవాలు చాలా వరకూ కాలిపోయినట్లు తెలుస్తున్నది. సుమారు 60 నుంచి 70 శాతం కాలిపోయిన నీరజ్ బాడీ, అమృత శరీరం నుంచి కొద్దిభాగం మాత్రమే లభ్యమైంది. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. దారుణాన్ని అడ్డుకోకుండా చూస్తూ నిలబడిపోయిన నీరజ్ కుటుంబ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


logo