గురువారం 01 అక్టోబర్ 2020
Crime - Aug 17, 2020 , 15:43:39

పొలంలో మేస్తున్న ఆవును తరిమాడని.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన స్థానికులు.. వీడియో వైరల్‌

పొలంలో మేస్తున్న ఆవును తరిమాడని.. ముస్లిం వ్యక్తిని చితకబాదిన స్థానికులు.. వీడియో వైరల్‌

శ్రీనగర్ : జమ్మూలోని రియాసిలో అర్నాస్ ప్రాంతంలోని గార్హి గ్రామంలో ఒక ఘోర సంఘటన చోటు చేసుకుంది. పొలంలో మేస్తున్న ఆవును ఓ మైన‌ర్‌బాలుడు తరిమేసాడని అతడి తండ్రి, మేనల్లుడిని స్థానికులు చితకబాదారు. ఈ వీడిమో ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌ అవుతుండగా దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. 

వీడియోలో ముహమ్మద్ అస్గర్ (40), అతడి మేనల్లుడు జావిద్ అహ్మద్ (26)ను గుంపు కొట్టడం, తన్నడం కనిపిస్తుంది. పోలీసులు ఘటనా స్థలం వద్దకు వచ్చిన తరువాత వారు దాడిని ఆపేశారు.  ‘దేశ్ కే గాడ్రాన్ కో.. గోలి మారి సలోన్ కో’ (దేశ ద్రోహులను కాల్చివేయండి) అంటూ, భారత్‌మాతాకి జై వంటి నినాదాలు చేస్తూ దాడికి పాల్పడ్డారు. 

వివరాలు.. బాధితుడి బంధువులతో పాటు అతడి కుమారుడు మూడు-నాలుగు రోజుల క్రితం తమ పొలంలోకి మేత కోసం వచ్చిన ఆవులను వెంబడించారు. ఈ ప్రక్రియలో ఓ ఆవు గాయపడింది. ఆవును కొట్టి గాయపర్చినందుకు గాను అస్గర్‌, జావిద్ ‌అహ్మద్‌లను గ్రామంలోని పెద్దలు పంచాయతీకి పిలిచారు. వారు ఊరి పెద్ద పంచ సంజయ్‌ ఇంటికి వెళ్లినప్పుడు ఓ గుంపు వారిపై విచక్షణా రహితంగా దాడి చేయడం ప్రారంభించింది. వారు మొదట కర్రలతో కొట్టి తరువాత కాళ్లతో తన్నినట్లు సమాచారం. 

జావి‌ద్‌ సోదరుడు ముష్తాక్‌ అహ్మద్‌ మాట్లాడుతూ ఈ దాడిలో తన సోదరుడు తీవ్రంగా గాయపడ్డాడన్నాడు. అమానుషంగా కొట్టడం వల్ల అతడి చర్మం మొత్తం పగిలిపోయిందని, దాడి జరుగుతున్నప్పుడు పోలీసులు ఘటనా స్థలానికి రాకపోతే వారు తన సోదరుడిని కొట్టి చంపేసేవారన్నాడు. 

 గ్రామంలో ముస్లింలు తక్కువ జనాభా ఉన్నందున ఉద్దేశపూర్వకంగా తమపై దాడులు జరుపుతున్నారని ముష్తాక్‌ పేర్కొన్నాడు.  గ్రామంలో మొత్తం 1,700-1,800 మంది ఉండగా అందులో కేవలం 8-10 కుటుంబాలు మాత్రమే తమవి ఉన్నాయన్నాడు. ఈ ఘటనను జమ్మూ కాశ్మీర్‌లోని రాజకీయ పార్టీలతో పాటు ప్రజలు కూడా ఖండిస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఎస్‌ఎస్పీ రియాసి మాట్లాడుతూ నిందితులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశామని, వీడియోలో దాడి చేసే వారందరిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఆవును గాయ పర్చినందుకు అస్గర్‌ కుమారుడిపై కూడా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందిగా ఆమె పోలీసులను ఆదేశించారు. లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo