బుధవారం 27 జనవరి 2021
Crime - Nov 11, 2020 , 15:13:43

లిఫ్ట్ ఆఫ‌ర్ చేసి దోచుకునే దోపిడి దొంగ‌లు అరెస్టు

లిఫ్ట్ ఆఫ‌ర్ చేసి దోచుకునే దోపిడి దొంగ‌లు అరెస్టు

ఢిల్లీ : పోలీసులుగా చెప్పుకుంటూ ర‌హ‌దారి వెంట వేచిఉన్న వ్య‌క్తుల‌కు లిఫ్ట్ ఆఫ‌ర్ చేసి అనంత‌రం వారిని దోచుకునే దొంగ‌ల ముఠా స‌భ్యుల‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘట‌న దేశ రాజ‌ధాని న‌గ‌రం ఢిల్లీలో చోటుచేసుకుంది. నిందితుల‌ను లిఫాఫెబాజ్ ముఠాకు చెందిన‌ రోబీ(40), ర‌కుల్ కుమార్‌(29), అలిక్ అబ్ర‌హం(37), రాహుల్‌(27)గా గుర్తించారు. రోడ్డు వెంట బ‌స్సు, ట్యాక్సీ కోసం వేచి చూస్తున్న వారిని ల‌క్ష్యంగా చేసుకుని లిఫ్ట్ ఇచ్చేవారు. మార్గ‌మ‌ధ్యంలో ముందు పోలీస్ చెకింగ్ ఉంద‌ని చెప్పి వారి వ‌ద్ద ఉన్న న‌గ‌దును, ఇత‌ర విలువైన వ‌స్తువుల‌ను క‌వ‌ర్‌లో ప్యాక్ చేసేవారు. అనుమానం రాకుండా నిందితుల్లోని ఒక‌రు కూడా త‌న వ‌ద్ద ఉన్న‌ వ‌స్తువుల‌ను మ‌రో క‌వ‌ర్‌లో ప్యాక్ చేసేవాడు. కొన్నిసార్లు ఏటీఎం పిన్ నెంబ‌ర్‌ను సైతం అడిగి తెలుసుకునేవారు. ఇలా ప్ర‌యాణం కొన‌సాగించి గ‌మ్య‌స్థానం చేరిన త‌ర్వాత క‌వ‌ర్ల‌ను మార్చి స‌ద‌రు వ్య‌క్తుల‌కు ఇచ్చేవారు. ఇంటికి వెళ్లి క‌వ‌ర్‌ను తెరిచి చూసి తాము మోస‌పోయిన‌ట్లుగా క‌నుగొనేవారు బాధితులు. మ‌రోవైపు దొంగ‌లు ఏటీఎం కార్డు పిన్ నెంబ‌ర్‌తో డ‌బ్బులు డ్రా చేసి ఊడాయించేవారు. 

డిప్యూటీ క‌మిష‌న‌ర్ ఆఫ్ పోలీసు(సౌత్‌) అతుల్ కుమార్ థాకూర్ మాట్లాడుతూ... గ‌డిచిన సోమ‌వారం నాడు అందిన విశ్వ‌స‌నీయ స‌మాచారం మేర‌కు వ‌ల‌ప‌న్ని ముఠా స‌భ్యుల‌ను ప‌ట్టుకున్న‌ట్లు తెలిపారు. వారి వ‌ద్ద దొరికిన వ‌స్తువులు, విచార‌ణ‌లో వెల్ల‌డించిన విష‌యాల ప్ర‌కారం న‌లుగురు స‌భ్యులు లిఫాఫెబాజ్ ముఠాకు చెందిన‌వారిగా గుర్తించిన‌ట్లు వెల్ల‌డించారు. నిందితుల వ‌ద్ద దొంగిలించిన ఆరు మొబైల్ ఫోన్లు, న‌గ‌లు, 14 క‌వ‌ర్లు, వాకీ టాకీ, పోలీసు యూనిఫాంల‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు చెప్పారు. వీరు ప్ర‌యాణించే కారు సైతం కొట్టేసిన‌దిగా గుర్తించారు. నిందితులంతా క‌ర‌డుగ‌ట్టిన నేర‌గాళ్లు అని చీటింగ్‌, దొంగ‌త‌నాలు, దోపిడీ, ఆయుధాల కేసుల్లో ఉన్నార‌న్నారు. 


logo