బుధవారం 20 జనవరి 2021
Crime - Dec 27, 2020 , 18:56:24

రైతుల కోసం పంజాబ్ న్యాయ‌వాది ఆత్మ‌హ‌త్య

రైతుల కోసం పంజాబ్ న్యాయ‌వాది ఆత్మ‌హ‌త్య

న్యూఢిల్లీ: ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతున్న రైతుల కోసం మ‌రో వ్య‌క్తి ప్రాణ త్యాగం చేశాడు. ఢిల్లీ శివార్ల‌లో రైతులు ఆందోళ‌న చేస్తున్న ప్ర‌దేశానికి కొద్ది దూరంలోనే పంజాబ్‌కు చెందిన అమ‌ర్‌జీత్ సింగ్ అనే న్యాయ‌వాది ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. టిక్రి స‌రిహ‌ద్దులో విషం తాగి చ‌నిపోయిన అమర్‌జీత్ పంజాబ్‌లోని ఫ‌జిల్కా జిల్లా జ‌లాలాబాద్ ప్రాంతానికి చెందిన వాడిగా పోలీసులు గుర్తించారు. అప‌స్మార‌క స్థితిలో ఉన్న అమ‌ర్‌జీత్‌ను రోహ్‌త‌క్‌లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించ‌గా అప్ప‌టికే మృతి చెందిన‌ట్లు వైద్యులు ధృవీక‌రించార‌ని తెలిపారు. 

కాగా, రైతుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగానే తాను ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నాన‌ని అమ‌ర్‌జీత్ త‌న సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. ప్ర‌జ‌ల మాట వి‌ని వివాదాస్ప‌ద వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌ను ర‌ద్దు చేయాలంటూ ఆ లేఖ‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీకి విజ్ఞ‌ప్తి చేశారు. అమ‌ర్‌జీత్ డిసెంబ‌ర్ 18న సూసైడ్ నోట్ రాసిపెట్టుకున్న‌ట్లు ఆ లేఖ‌పై ఉన్న తేదీని బ‌ట్టి తెలుస్తున్న‌ద‌ని పోలీసులు తెలిపారు. అమ‌ర్‌జీత్ కంటే ముందే మ‌రో ఇద్ద‌రు కూడా రైతుల ఆందోళ‌న‌కు మ‌ద్దుతుగా ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డారు.

ఈ నెల ప్రారంభంలో సిక్కు పూజారి సంత్ రామ్ సింగ్ (65) రైతుల బాధ చూడ‌లేక‌పోతున్నాన‌ని సూసైడ్ నోట్ రాసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. ఆ త‌ర్వాత కొన్ని రోజుల‌కే పంజాబ్‌లోని భ‌టిండా ప్రాంతానికి చెందిన 22 ఏండ్ల‌ యువ‌రైతు.. ఢిల్లీ స‌రిహ‌ద్దుల్లో ఆందోళ‌న జ‌రుగుతున్న‌ ప్రాంతం నుంచి ఇంటికి వెళ్లి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. తాజాగా న్యాయ‌వాది ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ‌టంతో రైతుల ఆందోళ‌న‌కు మ‌ద్ద‌తుగా ముగ్గురు ఆత్మ‌బ‌లిదానం చేసిన‌ట్ల‌య్యింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo