శనివారం 26 సెప్టెంబర్ 2020
Crime - Jun 23, 2020 , 13:40:51

కిలాడీ కిడ్నాపర్‌.. 4 గంటల్లో పట్టుకున్నారు..

కిలాడీ కిడ్నాపర్‌.. 4 గంటల్లో పట్టుకున్నారు..

  • మూడేండ్ల చిన్నారిని ఎత్తుకెళ్లిన మహిళ
  • సీసీటీవీ ఫుటేజీ చూసి పట్టుకున్న పోలీసులు

‌హైదరాబాద్‌ :  కలకలం సృష్టించిన మూడేండ్ల్ల బాలిక కిడ్నాప్‌ కేసును బోయిన్‌పల్లి పోలీసులు నాలుగు గంటల్లో ఛేదించారు. బాలికను తల్లి ఒడికి చేర్చారు.  మెదక్‌ జిల్లాకు చెందిన స్వరూప రెండు రోజుల క్రితం భర్తతో గొడవపడి  సికింద్రాబాద్‌కు వచ్చింది. రైల్వే స్టేషన్‌ వద్ద కూతురితో కలిసి ఉండగా.. ఓ వ్యక్తి ఆమెను గమనించి వివరాలు తెలుసుకున్నాడు. అనంతరం ఆ వ్యక్తి మియాపూర్‌లో ఉంటున్న నాగమ్మకు ఈ విషయాన్ని చేరవేశాడు. వీరిద్దరూ ఎలాగైనా  ఆ బాలికను కిడ్నాప్‌ చేయాలని పథకం వేశారు. ఆదివారం సాయంత్రం రైల్వే స్టేషన్‌ సమీపంలో ఉన్న స్వరూపకు మాయమాటలు చెప్పి మియాపూర్‌లో నాగమ్మ ఇంటికి తీసుకెళ్లాడు. సోమవారం ఉదయం ఇంట్లోనే టిఫిన్‌ చేసి, మధ్యాహ్నం బోయిన్‌పల్లి చౌరస్తాకు చేరుకున్నారు. 

భోజనం ఎరగా పెట్టి కిడ్నాప్‌..

బాలిక కిడ్నాప్‌నకు పథకం వేసిన నాగమ్మ.. తన వద్దనున్న రూ.50లను స్వరూపకు ఇచ్చి.. పోలీస్‌స్టేషన్‌ ఎదురుగా ఉన్న హోటల్‌ నుంచి భోజనం తీసుకురమ్మని సూచించింది. స్వరూప కూతురు సరిత ఆ సమయంలో నాగమ్మ వద్దే ఉన్నది. ఇదే అవకాశంగా భావించిన నాగమ్మ.. మూడేండ్ల సరితను తీసుకొని నిజామాబాద్‌ బస్‌ డిపో బస్సు ఎక్కి వెళ్లిపోయింది. భోజనం పార్సిల్‌ తీసుకుని వచ్చిన స్వరూపకు నాగమ్మ, కూతురు సరిత, మరో వ్యక్తి కనిపించలేదు. కంగారుపడిన స్వరూప పక్కనే ఉన్న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.

నాలుగు గంటల్లో..

 తొలుత పోలీస్‌ స్టేషన్‌ ముందున్న సీసీ కెమెరాలను ఎస్సై సుధాకర్‌రెడ్డి పరిశీలించగా.. ఓ మహిళ బాలికను తీసుకుని నిజామాబాద్‌ డిపోకు చెందిన బస్సు ఎక్కినట్లుగా గుర్తించారు. దీంతో  సీఐ అంజయ్య ఆదేశాల మేరకు వెంటనే నిజామాబాద్‌ బస్‌ డిపో మేనేజర్‌కు ఫోన్‌ చేసి బస్సు వివరాలతో పాటు డ్రైవర్‌, కండక్టర్‌ ఫోన్‌ నంబర్లు సేకరించి, వారిని సంప్రదించగా.. అప్పటికే ఆ బస్సు రామాయంపేట వరకు చేరుకున్నట్లు తెలుసుకున్నారు. అక్కడి పోలీసులను అప్రమత్తం చేయడంతో వారు చెక్‌పోస్ట్‌ ఏర్పాటు చేసి, నాగమ్మను అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే సీఐ అంజయ్య ఒక పోలీస్‌ వాహనాన్ని రామాయంపేటకు పంపించారు. అక్కడి నుంచి నాగమ్మతో పాటు కిడ్నాప్‌నకు గురైన సరితను బోయిన్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చారు. బాలికను క్షేమంగా తల్లికి అప్పగించారు.  కేవలం నాలుగు గంటల్లోనే కిడ్నాప్‌ మిస్టరీని ఛేదించి.. నిందితురాలిని పట్టుకున్న సీఐ అంజయ్య, ఎస్సై సుధాకర్‌రెడ్డి, కానిస్టేబుల్‌ మోహన్‌ను నార్త్‌జోన్‌ డీసీపీ కళ్మేశ్వర్‌ సింగెన్‌వార్‌, బేగంపేట ఏసీపీ నరేశ్‌రెడ్డి అభినందించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితురాలిని గుర్తించినట్లు సీఐ  తెలిపారు. క్షేమంగా తన పాప చేరడంతో ఆ తల్లి సంతోషాన్ని వ్యక్తం చేసింది.logo