గురువారం 24 సెప్టెంబర్ 2020
Crime - Jun 17, 2020 , 15:03:33

ట్రాన్స్‌జెండర్‌ అని వేధించారు.. అందుకే ఆత్మహత్య

ట్రాన్స్‌జెండర్‌ అని వేధించారు.. అందుకే ఆత్మహత్య

లక్నో : ఓ 16 ఏళ్ల యువకుడిని తోటి స్నేహితులు ట్రాన్స్‌జెండర్‌ అని వేధించారు. చివరకు అతను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ బరేలి జిల్లాలోని సుభాష్‌ నగర్‌లో సోమవారం చోటు చేసుకోగా ఆలస్యంగా వెలుగు చూసింది. 

సుభాష్‌ నగర్‌కు చెందిన యువకుడు(16) పదో తరగతి చదువుతున్నాడు. అతని తల్లి నాలుగేళ్ల క్రితం చనిపోగా, తండ్రి మొబైల్‌ స్టోర్‌ నిర్వహిస్తున్నాడు. యువకుడికి ఇద్దరు సోదరులు, సోదరి ఉన్నారు. సోదరికి వివాహమైంది. సోమవారం రోజు తండ్రి ఓ కుమారుడితో కలిసి కూరగాయల మార్కెట్‌కు వెళ్లాడు. మరో సోదరుడు ఇంకో గదిలో చదువుకుంటున్నాడు. ఈ సమయంలో ఆ యువకుడు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆత్మహత్య చేసుకున్నట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. 

సూసైడ్‌ నోట్‌ స్వాధీనం

యువకుడు ఉరేసుకున్న గదిలో ఓ సూసైడ్‌ నోట్‌ లభ్యమైంది. సూసైడ్‌ నోట్‌ సారాంశం.. నాన్న సారీ.. నేను మంచి కుమారుడిగా ఉండలేకపోతున్నాను. నాలో అమ్మాయిలా లక్షణాలు కనిపిస్తున్నాయి. నా ముఖం కూడా అమ్మాయిలా మాదిరే ఉంది. నన్ను చూసి జనాలు, ఫ్రెండ్స్‌ నవ్వుతున్నారు. నా లోపల ట్రాన్స్‌జెండర్స్‌ లక్షణాలు ఉన్నట్లు అనిపిస్తుంది. నా జీవితం చీకట్లోకి వెళ్తుంది. కాబట్టి నేను చనిపోవడం అనివార్యమైంది. నన్ను అమ్మాయిలా ఆశీర్వదించు. ఒక వేళ మన కుటుంబంలో ఆడబిడ్డ పుడితే.. నేను మళ్లీ తిరిగి వచ్చానని నమ్మండి అని రాసి ఉంది. 

నా కుమారుడిని ఎగతాళి చేసేవారు

అమ్మాయి పోలికలు కనిపించే నా కుమారుడిని కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతరులు ఎగతాళి చేసేవారు అని తండ్రి పేర్కొన్నాడు. మిగతా ఇద్దరు పిల్లలను చక్కగా చూసుకునే వాడు అని బోరున విలపించాడు. తాను లేనప్పుడు వారికి అన్నం వండిపెట్టే వాడని చెప్పాడు. చాలా సిగ్గు పడేవాడు.. అంతే కాదు పాటలు పాడుతూ, అమ్మాయిల్లా డ్యాన్స్‌ చేసేవాడని తండ్రి తెలిపాడు. 


logo