శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Crime - Jul 12, 2020 , 12:20:00

భర్తను తానే చంపి.. కొవిడ్‌తో చనిపోయాడని నమ్మించి

భర్తను తానే చంపి.. కొవిడ్‌తో చనిపోయాడని నమ్మించి

  • వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడని ప్రియుడితో కలిసి హత్య

న్యూ ఢిల్లీ : మే 1న వాయువ్య ఢిల్లీలోని అశోక్ విహార్‌లో ఓ మహిళ ప్రియుడితో కలిసి తన భర్తను చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. అప్పుడు ఆమె పోలీసులు, చుట్టుపక్కల వారికి తన భర్త కొవిడ్‌19తో చనిపోయాడని నమ్మించే ప్రయత్నం చేసింది. అయితే కరోనాతో చనిపోయాడనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అనుమానం వచ్చిన పోలీసులు సదరు మహిళను నిలదీయగా అసలు గుట్టు బయటబడింది. 

వివరాలు.. ఒడిశాకు చెందిన శరత్‌దాస్‌(45), అనితదాస్‌(35)ను గత 15 పదేండ్ల కిందట వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు సంతానం. వీరు నోయిడాలో అనిత బంధువులతో కలిసి నివసిస్తున్నారు. అదే ప్రాంతంలో నివసిస్తున్న సంజయ్‌(32)తో అనిత వివాహేతర సంబంధం పెట్టుకుంది. కొన్ని నెలల క్రితం శరత్ అనిత వివాహేతర సంబంధం గురించి తెలుసుకొని తరచూ దానిపై గొడవ పెట్టేవాడు. అయితే ఈ నేపథ్యంలో శరత్‌ను ఎలాగైనా అడ్డుతొలగించుకోవాలని సంజయ్‌తో అనిత చెప్పింది. ఎవరికి అనుమానం రాకుండా కరోనా మహమ్మారి సమయంలో చంపాలని వారు నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా మే 1 రాత్రి శరత్ గాఢ నిద్రలో ఉండగా అనిత సంజయ్‌ను పిలిపించి ఇద్దరు కలిసి దుప్పటితో ఊపిరాడకుండా చేసి చంపేశారు. అనంతరం చుట్టుపక్కల వారిని కరోనాతో మృతిచెందినట్లు నమ్మించగా బంధువులు అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

పోలీసులు అనితను పిలిచి విచారించగా తన భర్త కరోనా సోకి చనిపోయాడని పొంతనలేని సమాధానం చెబుతోంది. అయితే ఆ వ్యక్తి ఏనాడు అనారోగ్యంతో లేడని, ఏరోజు కూడా దవాఖానలో సంప్రదించలేదని పోలీసుల విచారణలో తేలింది. 

డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ విజయంత ఆర్య మాట్లాడుతూ శరత్‌ హత్య అనంతరం ప్రాథమిక విచారణ సందర్భంగా కరోనాతో చనిపోయినట్లు తన భర్తకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను చూపాలని మహిళను కోరినట్లు తెలిపారు. తన భర్తకు కరోనా లక్షణాలు ఉన్నాయా అని తాము అడిగినప్పుడు ఆ మహిళ సమాధానాన్ని దాటవేస్తోందని ఆర్య తెలిపారు.  అనుమానంతో శరత్‌ మృతదేహాన్నిపోస్టుమార్టం నిమిత్తం బాబు జగ్జీవన్ రామ్ మెమోరియల్ దవాఖానకు తరలించామని ఆర్య చెప్పారు. మే 4 న ఆవ్యక్తి పోస్టుమార్టం రిపోర్టులో హత్యగా ధృవీకరించబడడంతో కేసు నమోదు చేసినట్లు డీసీపీ తెలిపారు. అనితను అదుపులోకి తీసుకొని మరోసారి ప్రశ్నించగా తానే సంజయ్‌తో కలిసి హత్య చేసినట్లు నేరం ఒప్పుకుందని ఆర్య పేర్కొన్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo