సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Aug 08, 2020 , 20:08:07

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. ముగ్గురు కుమార్తెలను చంపి తానూ ఆత్మహత్య

లాక్‌డౌన్‌ ఎఫెక్ట్‌.. ముగ్గురు కుమార్తెలను చంపి తానూ ఆత్మహత్య

బింద్‌ : లాక్‌డౌన్‌ వల్ల ఉపాధి లేక వేలల్లో జనం రోడ్డున పడగా.. వందల్లో ఆకలి చావులు నమోదయ్యాయి. కరోనా వల్ల కంపెనీలు కుదేలవడంతో స్టాఫ్‌ను విధుల నుంచి తొలగిస్తున్నాయి. దీంతో ఉద్యోగులు కుటుంబ బాధ్యతను ఎలా మోయాలో తెలియక మనస్థాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. అలాంటి సంఘటనే మధ్యప్రదేశ్‌ రాష్ర్టంలో చోటు చేసుకుంది. 

లాక్‌డౌన్‌ వల్ల ఉద్యోగం పోవడంతో ఓ వ్యక్తి తన ముగ్గురు కుమార్తెలను బావిలోకి తోసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. బింద్‌ జిల్లా అందియారి గ్రామానికి చెందిన రాజేశ్‌ రాజక్ (42) ముంబైలో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. లాక్‌డౌన్‌ కారణంగా ఇటీవల అతడి ఉద్యోగం పోయింది. దీంతో రాజేశ్‌ తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. రాజేశ్‌కు భార్య నలుగురు కుమార్తెలున్నారు. ఉద్యోగం పోవడంతో వారిని సాకేదెలా అని తరచూ ఆలోచిస్తూ ఉండే రాజక్‌.. ఆర్థిక పరిస్థితిపై భార్యతో చర్చలు జరుపుతూ అసహనం వ్యక్తం చేసేవాడు. 

ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి భార్యభర్తలిద్దరి మధ్య ఇదే విషయమై గొడవ జరిగింది. ఆ తరువాత రాజేశ్‌ తన ముగ్గురు కుమార్తెలు అనుష్క (10), చైనా (8), సంధ్య (5)లను ఇంటి సమీపంలోని బావి వద్దకు తీసుకెళ్లి నడుముకి తాడు కట్టి అందులో తోసేసి తానూ దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. 

శనివారం ఉదయం స్థానికులు బావిలో మృతదేహాలను గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకొని వెలికి తీశారు. కేసు నమోదు చేసుకొని లోతుగా విచారిస్తామని డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ రాజేశ్‌ హింగాంకర్ తెలిపారు. ఇదిలా ఉండగా రాజేశ్‌కు మరో రెండున్నరేండ్ల కుమార్తె ఉంది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo