ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Jul 03, 2020 , 18:17:39

కాన్పూర్ ఎన్ కౌంట‌ర్.. ప్ర‌ధాన నిందితుడిపై 60 క్రిమిన‌ల్ కేసులు

కాన్పూర్ ఎన్ కౌంట‌ర్.. ప్ర‌ధాన నిందితుడిపై 60 క్రిమిన‌ల్ కేసులు

ల‌క్నో : కాన్పూర్ ఎన్ కౌంట‌ర్ లో ప్ర‌ధాన నిందితుడైన రౌడీషీట‌ర్ వికాస్ దూబేపై 60 క్రిమిన‌ల్ కేసులు న‌మోదైన‌ట్లు పోలీసు ఉన్న‌తాధికారులు వెల్ల‌డించారు. 8 మంది పోలీసుల హ‌త్య‌లో వికాస్ దూబే ప్ర‌ధాన నిందితుడు. మొత్తం 60 క్రిమినల్ కేసుల్లో ఆరు హ‌త్య కేసులు, 11 హ‌త్యాయ‌త్నం కేసులు రౌడీషీట‌ర్ పై న‌మోదు అయ్యాయి. ఈ కేసుల‌న్ని చౌబేపూర్ పోలీసు స్టేష‌న్ లో న‌మోదైన‌ట్లు తెలిపారు.

ఆరుసార్లు గుండా చ‌ట్టం కింద‌, ఏడు సార్లు యూపీ గ్యాంగ్ స్ట‌ర్ చ‌ట్టం కింద‌, ఒక‌సారి నార్కోటిక్ డ్ర‌గ్స్ అండ్ సైకోట్రోపిక్ స‌బ్ స్టాన్సెస్ చ‌ట్టం కింద అరెస్టు అయ్యాడు వికాస్ దూబే. 

జిల్లా పంచాయ‌తీ మాజీ స‌భ్యుడైన దూబే.. ఈ ఏడాది రెండు క్రిమినల్ కేసుల్లో అరెస్టు అయ్యాడు. ఈ రెండు కేసులు కూడా.. కిడ్నాప్, హ‌త్యాయ‌త్నం, దోపిడీ ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో న‌మోదు అయ్యాయి. దూబేపై మొట్ట‌మొద‌టి సారి దొంగ‌త‌నం కేసు 1993లో న‌మోదైంది. బీజేపీ నాయ‌కుడు సంతోష్ శుక్లా హ‌త్య కేసులో కూడా ఈ రౌడీషీట‌ర్ ప్ర‌ధాన నిందితుడు. ఈ హ‌త్య 2001, అక్టోబ‌ర్ లో జ‌రిగింది. దూబే భార్య రిచా.. ప్ర‌స్తుతం జిల్లా పంచాయ‌తీ మెంబ‌ర్ గా కొన‌సాగుతున్నారు.

అయితే ఓ హ‌త్య కేసులో వికాస్ దూబేను ప‌ట్టుకునేందుకు గురువారం రాత్రి డీఎస్పీ నేతృత్వంలోని 16 మంది సిబ్బందితో కూడిన బృందం.. కాన్పూర్ జిల్లాలోని బికారు గ్రామానికి వెళ్లింది. అప్ప‌టికే తుపాకుల‌తో సిద్ధంగా ఉన్న దూబే ముఠా స‌భ్యులు.. భ‌వ‌నంపై నుంచి పోలీసుల‌పై కాల్పుల మోత మోగించారు. ఈ కాల్పుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రాతోపాటు ముగ్గురు ఎస్‌ఐలు, నలుగురు కానిస్టేబుళ్లు చనిపోగా మరో నలుగురు గాయపడ్డారు. ఇద్దరు క్రిమినల్స్ కూడా మరణించారు.


logo