మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jul 30, 2020 , 12:17:55

చ‌పాతీలో విషం.. జ‌డ్జి, కుమారుడు మృతి

చ‌పాతీలో విషం.. జ‌డ్జి, కుమారుడు మృతి

భోపాల్ : ఓ మ‌హిళ దారుణానికి ఒడిగ‌ట్టింది. త‌న‌కు దూర‌మ‌య్యాడ‌నే అక్క‌సుతో చ‌పాతీలో విషం క‌లిపి మొత్తం కుటుంబానికి ఇచ్చింది. దీంతో జ‌డ్జితో పాటు ఆయ‌న కుమారుడు చ‌నిపోయారు. ఈ దారుణ ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని చింద్వారా జిల్లాలో చోటు చేసుకుంది. 

మ‌ధ్య‌ప్ర‌దేశ్‌కు చెందిన జ‌డ్జి బేతుల్ మ‌హేంద్ర త్రిపాఠికి సంధ్యారాణి(45) అనే ఎన్జీవోతో ప‌రిచ‌యం ఏర్ప‌డింది. గ‌త నాలుగు నెల‌ల నుంచి సంధ్యారాణికి త్రిపాఠి మ‌ధ్య దూరం పెరిగింది. త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అక్క‌సుతో జ‌డ్జి కుటుంబాన్ని అంత‌మొందించాల‌ని సంధ్యారాణి నిర్ణ‌యించుకుంది. 

జులై రెండో వారంలో సంధ్యారాణి త్రిపాఠి క‌లిశారు. ఇంట్లో ఉన్న స‌మ‌స్య‌ల నుంచి విముక్తి పొందేందుకు పూజ‌లు చేయిస్తాన‌ని న‌మ్మ‌బ‌లికింది. అందుకు గోధుమ పిండి కావాల‌ని కోరింది. మ‌ళ్లీ ఆ పిండిని చ‌పాతీలుగా చేసుకుని తినాల‌ని చెప్ప‌డంతో జ‌డ్జి న‌మ్మాడు. ఈ క్ర‌మంలో జులై 20వ తేదీన సంధ్యారాణి మంత్రాలు చేయించిన గోధుమ పిండిని జ‌డ్జి కుటుంబానికి ఇచ్చింది. ఆ పిండిలో రాణి విషం క‌లిపి ఇచ్చింది. 

అదే రోజు త్రిపాఠి కుటుంబం.. ఆ గోధుమ పిండితో రాత్రికి చపాతీలు చేసుకున్నారు. జ‌డ్జితో పాటు ఇద్ద‌రు కుమారులు ఆ చ‌పాతీల‌ను తిన్నారు. భార్యేమో అన్న‌మే తినేసింది. చ‌పాతీలు తిన్న కాసేప‌టికే జ‌డ్జికి, ఆయ‌న పెద్ద కుమారుడు(33) తీవ్ర అస్వ‌స్థ‌తకు గుర‌య్యారు. వాంతులు కావ‌డంతో.. చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి వెళ్లారు. 

జులై 25న వారి ప‌రిస్థితి మ‌రింత విష‌మించింది. జ‌డ్జి ఆస్ప‌త్రిలోనే ఆదివారం మ‌ర‌ణించ‌గా, కుమారుడిని నాగ‌పూర్‌కు త‌ర‌లిస్తుండ‌గా, మార్గ‌మ‌ధ్య‌లోనే ప్రాణాలు కోల్పోయాడు. చిన్న కుమారుడి ఆరోగ్య ప‌రిస్థితి నిల‌క‌డ‌గా ఉంది. 

జడ్జి, ఆయ‌న కుమారుడు మృతితో కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. కేసును లోతుగా విచారించిన పోలీసులు.. సంధ్యారాణిని, ఆమె డ్రైవ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు. తానే గోధుమ పిండిలో విషం క‌లిపి ఇచ్చిన‌ట్లు ఒప్పుకుంది సంధ్యారాణి. ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్టు చేశారు పోలీసులు. 


logo