గురువారం 26 నవంబర్ 2020
Crime - Oct 28, 2020 , 16:13:07

జగిత్యాల.. హత్య కేసులో తండ్రి సహా ముగ్గురికి యావజ్జీవం

జగిత్యాల.. హత్య కేసులో తండ్రి సహా ముగ్గురికి యావజ్జీవం

జగిత్యాల క్రైం : ఓ యువతి హత్య కేసులో తండ్రి, పినతల్లి వారికి సహకరించిన మరో వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ.12వేల చొప్పున జరిమానా విధిస్తూ జగిత్యాల సెకండ్‌ అడిషనల్‌ డిస్ట్రిక్ట్‌ పేషెంట్స్‌ జడ్జి సుదర్శన్‌ బుధవారం తీర్పు వెలువరించారు. సంఘటన వివరాల్లోకి వెళితే.. గొల్లపల్లి మండలం వెలుగుమట్ల గ్రామానికి చెందిన పుట్కూరి సత్యనారాయణరెడ్డి వివాహం పెగడపల్లి  మండలం మద్దులపెల్లి గ్రామానికి చెందిన కళ్లెం ప్రేమలతతో జరిగింది. వీరికి మౌనశ్రీ అనే కూతురు ఉంది. వివిధ కారణాలతో సత్యనారాయణ భార్య ప్రేమలతకు విడాకులు ఇచ్చాడు. ఈ సమయంలో కూతురికి వివాహం జరిపించాల్సిన బాధ్యతను తండ్రి సత్యనారాయణ పెద్ద మనుషుల సమక్షంలో తీసుకున్నాడు. అనంతరం ప్రేమలత కూతురుతో కలిసి కరీంనగర్‌లో నివాసం ఉంటుంది. సత్యనారాయణ లత అనే మరో మహిళను వివాహం చేసుకున్నాడు.

ఈ క్రమంలో మౌనశ్రీ వివాహ వయసుకు రాగా.. పెళ్లికి డబ్బులు ఖర్చు చేయాల్సి రావడంతో అడ్డు తొలగించుకోవాలని పథకం పన్నాడు. హత్యకు వేసుకున్న పథకం మేరకు.. 2015 సెప్టెంబర్‌ 8న కూతురు మౌనశ్రీని వెనుగుమట్లకు పిలిపించుకున్నాడు. ఇంటికి వచ్చాక యువతికి మత్తు ఇచ్చి గొంతు నిలిమి ఊపిరాడకుండా హత్య చేశాడు. సాధారణమరణంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. తల్లి ప్రేమలత ఇచ్చిన ఫిర్యాదు మేరకు గొల్లపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మౌనశ్రీ హత్యకు తండ్రి పుట్కూరి సత్యనారాయణరెడ్డికి పిన తల్లి పుట్కూరి లత, కళ్లెం రాజు అనే మరో వ్యక్తి సహకారం అందించినట్లు పోలీసులు విచారణలో గుర్తించారు. అప్పటి నుంచి కేసు విచారణలో ఉండగా.. బుధవారం కోర్టు నిందితులకు శిక్ష ఖరారు చేస్తూ తీర్పును వెలువరించింది. నిందితులైన తండ్రి సత్యనారాయణ, పినతల్లి లత వారికి సహకరించిన కళ్లెం రాజుకు రూ.12వేల చొప్పున జరిమానాతో పాటు యావజ్జీవ కారాగార శిక్ష విధించారు.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.