ఆదివారం 24 జనవరి 2021
Crime - Oct 12, 2020 , 15:35:50

గోవాలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్‌ : నలుగురు ఛత్తీస్‌గఢ్‌ వాసులు అరెస్టు

గోవాలో జోరుగా ఐపీఎల్ బెట్టింగ్‌ : నలుగురు ఛత్తీస్‌గఢ్‌ వాసులు అరెస్టు

పనాజీ : అరబ్‌ ఎమిరేట్స్‌లో జరుగుతున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ బెట్టింగ్‌లు గోవాలో జోరుగా సాగుతున్నాయి. విశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు పనాజీ సమీపంలోని రెసిడెన్షియల్ అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి రాకెట్‌ను గోవా పోలీసులు ఛేదించారు. ఈ రాకెట్టును నడుపుతున్న నలుగురు ఛత్తీస్‌గఢ్‌ వాసులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఐపీఎల్‌ ప్రారంభం నుంచి గోవాలోని పలు ప్రాంతాల్లో జోరుగా బెట్టింగ్‌ జరుగుతున్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులకు కచ్చితంగా అందిన సమాచారం మేరకు పనాజీ సమీపంలోని ఓ రెసిడెన్షియల్‌ అపార్ట్‌మెంట్‌పై పోలీసులు దాడి జరిపారు. పెద్ద ఎత్తున ఎలక్ట్రానిక్‌ వస్తువుల ద్వారా బెట్టింగ్‌ జరుగుతున్నట్లు తేలింది. పనాజీ కేంద్రంగా ఛత్తీస్‌గఢ్‌కు చెందిన కొందరు ఐపీఎల్‌ బెట్టింగ్‌ నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. బెట్టింగ్‌ నిర్వాహకులు రాయ్‌పూర్‌కు చెందిన రంజోత్ సింగ్ చబ్రా, సునీల్ మోత్వానీ, కపిల్ తోలాని, వినయ్ గంగ్వానీలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ముఠా ఇప్పటికే రూ.50 లక్షల విలువైన పందాలను అంగీకరించినట్లు తేలింది. "ఛత్తీస్‌గఢ్‌‌లోని తమ ఖాతాదారుల నుంచి ఫోన్‌లో పందెం స్వీకరిస్తున్నారు. బెట్టింగ్‌ స్థావరంపై దాడి జరిపి అనేక మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌ను స్వాధీనం చేసుకున్నాం. ఈ ముఠా ప్రస్తుత సీజన్లో ఇప్పటివరకు రూ.50 లక్షల వరకు పందెంగా తీసుకున్నారు" అని పోలీసు సూపరింటెండెంట్ (క్రైమ్) శోభిత్ సక్సేనా చెప్పారు. ఐపీఎల్ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి గోవా పోలీసు బృందాలు రాష్ట్రంలో ఆరు కంటే ఎక్కువ బెట్టింగ్‌ ముఠాలను అదుపులోకి తీసుకున్నాయి. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo