అంతర్రాష్ట్ర గంజాయి ముఠా అరెస్ట్

హైదరాబాద్ : అంతర్రాష్ట్ర గంజాయి ముఠాను రాచకొండ ఎస్ఓటీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వారి నుంచి 76 కిలోల గంజాయి, కారు, ద్విచక్ర వాహనం, రూ.3వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని సీలేరు నుంచి హైదరాబాద్‌కు గంజాయిని ముఠా తరలించి, విక్రయిస్తోంది. ఈ సందర్భంగా మీడియాకు రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మీడియాకు వివరాలు వెల్లడించారు. ఏపీ-ఒడిశా బార్డర్ నుంచి ఐదుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి గంజాయి సరఫరా చేస్తున్నారని చెప్పారు. ఈ క్రమంలో ఎస్ఓటీ పోలీసులు పట్టుకున్నారని, ఇందులో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామని, మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఎన్నికల సమయంలో పెద్ద ఎత్తున గంజాయిని స్వాధీనం చేసుకున్న సిబ్బందిని సీపీ మహేశ్ భగవత్ అభినందించారు.
ఎస్ఓటీ అడిషనల్ డీసీపీ సురేందర్‌రెడ్డి మాట్లాడుతూ విశాఖపట్నం ఏజెన్సీ ప్రాంతంలోని శివారులో మంగ అనే మహిళ గంజాయి సాగు చేస్తుందని.. స్థానికుడైన కబిరాజ్తోపాటు అతని స్నేహితుడు వెంకన్నస్వామి రవాణా చేస్తారని తెలిపారు. మధన్ అనే వ్యక్తి ఆర్డర్ ఇస్తే కబిరాజ్, వెంకన్నస్వామితో పంపిస్తుందని తెలిపారు. హైదరాబాద్‌లో ఎన్నికల నేపథ్యంతో మంగకు ఆర్డర్ ఇవ్వగా.. సదరు వ్యక్తులతో నెల 27న కారులో పంపగా.. సోమవారం తనిఖీలో పట్టుకున్నట్లు పేర్కొన్నారు. 37 బ్యాగులను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. సరఫరాదారులు రూ.5వేలకు కిలో చొప్పున కొనుగోలు చేసి రూ.10వేల వరకు విక్రయిస్తారని చెప్పారు. గతంలో నిందితులపై ఏవైనా కేసులు ఉన్నాయా?లేదా? అనే విషయంపై విచారణ జరుపుతున్నామని వివరించారు.