మంగళవారం 22 సెప్టెంబర్ 2020
Crime - Jun 22, 2020 , 22:41:39

సినిమాల్లో పోలీసు.. నిజజీవితంలో కార్ల దొంగ

సినిమాల్లో పోలీసు.. నిజజీవితంలో కార్ల దొంగ

లక్నో: ఉత్తరప్రదేశ్‌ పోలీసులు ఆదివారం ఓ అంతర్జాతీయ కార్ల దొంగల ముఠా గుట్టును రట్టు చేసింది. ముఠాలని ఐదుగురు సభ్యులను లక్నో  పోలీసులు అరెస్ట్‌ చేసి వీరి నుంచి బీఎండబ్ల్యూ సహా రూ. 5 కోట్ల విలువ చేసే 50 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకొన్నారు. ఈ కార్ల దొంగల ముఠాలో సినిమా నటుడు కూడా ఉండటం విశేషం.

లక్నో, పరిసర పట్టణాల్లో గత కొంత కాలంగా వరుసగా కార్లు చోరీకి గురవుతున్నాయి. అవికూడా కాస్ట్లీ కార్లు. వీటిపై కార్ల యజమానులు కేసు నమోదు చేయటంతో లక్నో పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసులు పక్కా ప్లాన్ తో కార్లు కొనేవారిగా అవతారమెత్తారు. కార్లు దొంగతనం చేస్తున్న ముఠాను బైటకు రప్పిందుకు సెకండ్ హ్యాండ్ కార్లు కొంటామని ప్రకటించారు. వారి పాచిక పారింది. కార్ల ముఠా కలుగులోంచి బైకొచ్చింది. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. 

దొంగలించిన కార్లను ముఠా సభ్యులు మరమ్మతు చేసి.. కార్ల నంబర్లు మార్చేసి.. వేరే ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్మేస్తుంటారని లక్నో పోలీస్ కమిషనర్ సుజిత్ పాండే తెలిపారు. యూపీ, నేపాల్, బీహార్, ఢిల్లీ, హర్యాణా ప్రాంతాల్లో వీరు పలు విలువైన కార్లు దొంగతనం చేశారని.. అరెస్టయిన వారిలో లక్నోకు చెందిన మొయినుద్దీన్ ఖాన్, వినయ్ తల్వార్, కాన్పూర్ కు చెందిన శ్యామ్ జీ జైస్వాల్ ఉన్నారని తెలిపారు. అలాగే ఈ ముఠాలో రిజ్వాన్ అనే వ్యక్తి కార్ల దొంగతనం ద్వారా సంపాదించిన డబ్బుతో ఓ హోటల్ కూడా కొనుగోలు చేసినట్లు తెలిపారు. ఈ ముఠాలో మరో ఎనిమిదిమంది పరారీలో ఉన్నారనీ..వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. కొట్టేసిన లగ్జరీ కార్లను తిరిగి అమ్మటానికి ఈ ముఠా టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని.. వీటిలో బీమా సంస్థల పాత్ర కూడా ఉన్నట్లుగా అనుమానిస్తున్నామని తెలిపారు. 

కార్ల దొంగల ముఠాలో నటుడు

గమ్మత్తేమిటంటే.. ఈ కార్ల దొంగల ముఠాలో ఓ భోజ్‌పురి నటుడు కూడా ఉన్నాడు. సినిమాల్లో ఎక్కువగా పోలీసు వేశాలు వేసే నాసిర్‌ కూడా పోలీసులకు పట్టుబడ్డాడు. ముకద్దర్, బాఘీ ఏక్‌ యోధా, ముకద్దర్‌ కా సికందర్‌ వంటి సినిమాల్లో పోలీసుగా పవర్‌ ఫుల్‌ పాత్రలు వేసి ఔరా అనిపించాడు. ఖరీదైన కార్లను టార్గెట్ గా చేసుకుని ముఠాతో కలిసి కార్లు కొట్టేశాడు. రీల్ లైఫ్ లో పోలీసు నుంచి రియల్ లైఫ్ లో దొంగగా మారాడు. నాసిర్‌ నిజ జీవితంలో దొంగగా మారడం చూసి అటు పోలీసులు ... ఇటు ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. logo