ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 15, 2020 , 21:46:48

వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని.. భార్య గొంతు కోసి హత్య

వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని.. భార్య గొంతు కోసి హత్య

ఘజియాబాద్‌ : వివాహేతర సంబంధానికి అడ్డొస్తుందని వ్యక్తి భార్యను గొంతు కోసి హత్య చేసిన ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రం ఘజియాబాద్‌ జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. భోజ్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ ప్రాంతంలోని నహాలి గ్రామానికి చెందిన సద్దాం హుస్సేన్‌కు ఎనిమిదేండ్ల క్రితం రేష్మా ఖాతూన్‌తో వివాహం అయ్యింది. ఇటీవల హుస్సేన్‌కు మరో మహిళతో పరిచయం ఏర్పడి అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. విషయం రేష్మకు తెలియడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఎంత చెప్పినా హుస్సేన్‌ పద్ధతి మార్చుకోకపోవడంతో జూలైలో రేష్మ పుట్టింటికి వెళ్లిపోయింది.

తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డు వస్తుందని ఆగ్రహం చెందిన హుస్సేన్‌ ఎలాగైనా ఆమెను అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. ఈ నేపథ్యంలో ఆగస్టు 31న తాను మారిపోయానని, బుద్ధిగా సంసారం చేసుకుంటానని మాయమాటలు చెప్పి తనతో రావాల్సిందిగా బతిమలాడి భార్యను బైక్‌ ఎక్కించుకున్నాడు. స్వగ్రామానికి తీసుకొచ్చేటప్పుడు మార్గమధ్యంలో కాల్వ పక్కన బైక్‌ నిలిపి కత్తితో రేష్మ గొంతు కోసి మృతదేహాన్ని చెట్ల పొదల్లో పడేసి ఏమి ఎరగనట్టు వెళ్లిపోయాడు.

ఇటీవల అక్కను చూద్దామని వచ్చిన రేష్మ సోదరుడికి ఆమె కనిపించకపోవడంతో తన బావను అడగ్గా పొంతనలేని సమాధానాలు చెబుతున్నాడు. అనుమానం వేసి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన పోలీసులు హుస్సేన్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా భార్యను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. సోమవారం కుళ్లిన రేష్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo