మంగళవారం 26 జనవరి 2021
Crime - Dec 07, 2020 , 16:19:34

తండ్రి మందలించడంతో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

తండ్రి మందలించడంతో ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్‌ ‌: తండ్రి మందలించడంతో మనస్థాపానికి గురైన ఇంటర్‌ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్‌లోని వినాయక్‌నగర్‌లో నివాసం ఉంటున్న గుంటి సాయికృప(17) ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం చదువుతున్నది. తండ్రి బాలరాజు ప్రైవేటు ఉద్యోగం చేస్తుండగా తల్లి హేమలత స్థానికంగా అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నది.

 గత కొన్ని రోజులుగా తనకు కడుపునొప్పి లేస్తోందంటూ తల్లిదండ్రులకు సాయికృప చెబుతోంది. దవాఖానకు వెళ్దామని చెప్పినా తనకు భయం అంటూ వెనక్కి తగ్గేది. ఇదిలా ఉండగా ఆదివారం సాయంత్రం కూడా మరోసారి కడుపునొప్పి వస్తోందంటూ సాయికృప తండ్రి బాలరాజుకు చెప్పింది. దీంతో ఆగ్రహానికి గురయిన తండ్రి ‘కడుపునొప్పి వస్తుందంటూ చెప్పి దవాఖానకు వెళ్దామంటే రావంటూ..’ మందలించాడు.  కడుపునొప్పి అంటూ తనను విసిగించవద్దని కసురుకున్నాడు.

దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సాయికృప తన గదిలోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎంతసేపటికి గదిలోంచి కూతురు రాకపోవడంతో తల్లి హేమలత అక్కడకు వెళ్లి చూడగా చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకున్న కూతురు కనిపించింది. స్థానికుల సహకారంతో ఆమెను కిందకు దింపి అపోలో దవాఖానకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ మేరకు బంజారాహిల్స్‌ పోలీసులకు తండ్రి  బాలరాజు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 


logo