బుధవారం 23 సెప్టెంబర్ 2020
Crime - Jun 20, 2020 , 19:13:56

ఛాతిలో నొప్పి అని నాట‌కం.. ఆస్ప‌త్రి నుంచి ఖైదీ ప‌రార్

ఛాతిలో నొప్పి అని నాట‌కం.. ఆస్ప‌త్రి నుంచి ఖైదీ ప‌రార్

ముంబై : ఓ ఖైదీ ఛాతిలో తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంద‌ని చెప్పి నాట‌క‌మాడాడు. ఆ ఖైదీ వ‌ద్ద ఉన్న సెక్యూరిటీ సిబ్బంది.. డాక్ట‌ర్ ను పిలిచేందుకు వెళ్లేస‌రికి.. అత‌ను ఆస్ప‌త్రి నుంచి పారిపోయాడు. ఈ ఘ‌ట‌న ఔరంగాబాద్ లోని ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో శుక్ర‌వారం చోటు చేసుకుంది. 

ఇమ్రాన్ బేగ్(32) అనే వ్య‌క్తి, మ‌రో ఇద్ద‌రు క‌లిసి ఓ వ్య‌క్తిని మార్చి 17న హ‌త్య చేశారు. ఈ హ‌త్య కేసులు ఈ ముగ్గురిని ఔరంగాబాద్ సెంట్ర‌ల్ జైలుకు త‌ర‌లించారు. అయితే గురువారం రోజు త‌న‌కు ఛాతిలో నొప్పి వ‌స్తుంద‌ని, శ్వాస సంబంధ స‌మ‌స్య‌లు త‌లెత్తాయ‌ని జైలు అధికారుల‌కు ఇమ్రాన్ బేగ్ చెప్పాడు. దీంతో అక్క‌డ విధుల్లో ఉన్న డాక్ట‌ర్ అత‌నికి మందులు ఇచ్చాడు. ఆ మెడిసిన్స్ కు ఏ మాత్రం నొప్పి త‌గ్గ‌లేద‌ని ఖైదీ తెలిపాడు. త‌న ఆరోగ్య ప‌రిస్థితి ఆందోళ‌న‌క‌రంగా ఉంద‌ని డాక్ట‌ర్ చెప్పాడు. 

దీంతో ఆ ఖైదీని ఔరంగాబాద్ ప్ర‌భుత్వ ఆస్ప‌త్రికి.. ఇద్ద‌రు సెక్యూరిటీ సిబ్బందితో పంపారు. శుక్ర‌వారం ఉద‌యం 5:45 గంట‌ల‌కు ఖైదీ కొత్త నాట‌కానికి తెర లేపాడు. కాల‌కృత్యాలు తీర్చుకునేందుకు వెళ్తాన‌ని చెప్పి.. త‌న చేతుల‌కు ఉన్న బేడీల‌ను సిబ్బంది చేత తొల‌గించుకున్నాడు. అంత‌లోనే త‌న‌కు తీవ్ర‌మైన నొప్పి వ‌స్తుంద‌ని న‌టించాడు. దీంతో నిజంగానే ఖైదీకి నొప్పి వ‌చ్చిందేమోన‌ని భావించిన సిబ్బంది.. డాక్ట‌ర్ ను పిలిచేందుకు వెళ్లారు. 

ఇదే మంచి అవ‌కాశం అనుకుని.. ఆస్ప‌త్రి నుంచి ఖైదీ పారిపోయాడు. ఖైదీ ఉన్న బెడ్ వ‌ద్ద‌కు రాగానే అత‌ను క‌నిపించ‌క‌పోయేస‌రికి సెక్యూరిటీ సిబ్బంది షాక‌య్యారు. ఇమ్రాన్ బేగ్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


logo