ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Crime - Sep 12, 2020 , 18:25:01

“నన్ను క్షమించండి. నేను అలసిపోయాను”.. నీట్ అభ్య‌ర్థి ఆత్మ‌హ‌త్య‌

“నన్ను క్షమించండి. నేను అలసిపోయాను”.. నీట్ అభ్య‌ర్థి ఆత్మ‌హ‌త్య‌

చెన్నై : “నన్ను క్షమించండి. నేను అలసిపోయాను.. ” అని ఓ 19 ఏళ్ల నీట్ అభ్య‌ర్థి నోట్ రాసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. ఆదివారం జరుగ‌బోయే నీట్ ప‌రీక్ష‌కు ముందు రోజు విద్యార్థిని సూసైడ్ చేసుకోవ‌డంతో ఆమె కుటుంబంలో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి. 

త‌మిళ‌నాడు రాష్ర్టం ముధ‌రైకు చెందిన మురుగ‌సుంద‌రం కుమార్తె జ్యోతిశ్రీ దుర్గ గతేడాది నీట్ పరీక్ష రాసినప్పటికీ 100 బేసి మార్కులు మాత్రమే సాధించగలిగింది. ఈ ఏడాది ఆదివారం జరుగబోయే పరీక్ష కోసం ఆమె ఒక సంవత్సరం నుంచి సిద్ధమవుతోంది. శుక్ర‌వారం రాత్రి భోజ‌న స‌మ‌యంలో కుటుంబ స‌భ్యుల‌తో బాగానే మాట్లాడిన జ్యోతి.. చ‌దువుకుంటాన‌ని చెప్పి గ‌దిలోకి వెళ్లింది. శనివారం ఉదయం త‌ల్లి త‌లుపులు కొట్టినా స్పంద‌న లేక‌పోవ‌డంతో బ‌ద్ద‌లు కొట్టి చూడ‌గా జ్యోతి ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఉంది. 

తన తండ్రిని ఉద్దేశించి జ్యోతి సుదీర్ఘ లేఖ రాసి ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డింది. పదేపదే తమ అంచనాలను అందుకోలేకపోతానేమోన‌ని భయపడుతున్నానని, వారిని నిరాశపరుస్తున్నాన‌ని సూసైడ్ నోట్‌లో రాసింది. న‌న్ను క్ష‌మించండి.. నేను అలిసిపోయాను అని రాసి ఉరి వేసుకొని త‌నువు చాలించింది. జ్యోతి తండ్రి మాట్లాడుతూ తన కుమార్తె బాగా చ‌దివేద‌ని, కానీ ఎందుకో తీవ్ర నిరాశ‌కు గురైంద‌ని, ప‌డుకునే ముందు త‌మ‌తో బాగానే మాట్లాడింద‌ని, కానీ ఇంత‌టి అఘాయిత్యానికి పాల్ప‌డుతుంద‌ని తాను అనుకోలేద‌న్నారు.    

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo