ఆదివారం 27 సెప్టెంబర్ 2020
Crime - Aug 20, 2020 , 15:02:43

భర్త, ఇద్దరు చిన్నారులకు అనస్థీషియా ఇచ్చి.. తానూ ఆత్మహత్య చేసుకున్న లేడీ డాక్టర్‌

భర్త, ఇద్దరు చిన్నారులకు అనస్థీషియా ఇచ్చి.. తానూ ఆత్మహత్య చేసుకున్న లేడీ డాక్టర్‌

నాగ్‌పూర్ : భర్త, ఇద్దరు చిన్నారులను హత్య చేసి ఓ లేడీ డాక్టర్ తానూ ఆత్మహత్య చేసుకుంది ‌. ఈ సంఘటన మహారాష్ర్టలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు.. డాక్టర్‌ సుష్మారాణే(35).. భర్త ధీరజ్‌(42) తన 11, 5 సంవత్సరాలు గల ఇద్దరు పిల్లలతో నాగ్‌పూర్‌లోని కొరాడి ప్రాంతంలో నివాసం ఉంటున్నారు. సుష్మ అవంతి దవాఖానలో డాక్టర్‌గా విధులు నిర్వహిస్తుండగా ఆమె భర్త ఓ ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

మంగళవారం ఉదయం 6 గంటల సమయంలో సుష్మ తన కుమార్తెతో ఓ దవాఖానకు వెళ్లి అనస్థీషియా మందును తీసుకొచ్చి ఇంట్లో పెట్టింది. తరువాత ఆమె తన భర్త, ఇద్దరు పిల్లలకు ఇంజక్షన్‌ ద్వారా అధిక మోతాదులో అనస్థీషియా ఇవ్వడంతో వారు మత్తులోకి జారుకొని మరణించారు. ఆ తరువాత సుష్మ కూడా ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. 

మంగళవారం నాగ్‌పూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ధీరజ్, ఇద్దరు పిల్లల మృతదేహాలున్న గదిలో రెండు సిరంజిలను స్వాధీనం చేసుకున్నారు. ఇంటి పెరడులో మరో సిరంజి, అనస్థీషియా ఖాళీ సీసాను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో కొన్ని మద్యం సీసాలు కూడా ఉండగా.. ధీరజ్ ఇంట్లో మద్యం సేవించేవాడని పోలీసులు గుర్తించారు. 

పోలీసులు అవంతి దవాఖాన వైద్యులు, ధీరజ్‌ పనిచేసే కళాశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులను ఈ దంపతులు ఎదుర్కొంటున్న మానసిక సమస్యల గురించి విచారించగా, తమకు తెలియదని వారు సమాధానం చెప్పినట్లు తెలిసింది. పోస్టుమార్టం తరువాత మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించి, ఫోరెన్సిక్ పరీక్షల కోసం నమూనాలను స్వీకరించినట్లు పోలీసులు తెలిపారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo