సోమవారం 13 జూలై 2020
Crime - Jun 01, 2020 , 08:57:12

భార్యను హీటర్‌తో కొట్టి చంపాడు!

భార్యను  హీటర్‌తో కొట్టి చంపాడు!

బంజారాహిల్స్‌: ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. నలుగురు సంతానం. అయినా ఆమెకు కట్నం వేధింపులు తప్పలేదు. అనుమానం... కట్నం తేలేదన్న కోపంతో భర్త కొట్టిన దెబ్బలకు చివరకు ప్రాణాలు విడిచింది. ఈ ఘటన బంజారాహిల్స్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్‌ రోడ్‌ నం 2లోని ఇందిరానగర్‌కు చెందిన రుడావత్‌ అనిల్‌ (31) 2009లో వికారాబాద్‌ జిల్లా దౌల్తాబాద్‌ మండలం, గౌడ మర్రిగడ్డ తండాకు చెందిన అనిత (29)ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సినిమా సెట్టింగ్స్‌కు కావాల్సిన సామగ్రిని అద్దెకు ఇచ్చే షాపును నిర్వహించే అనిల్‌, అనిత దంపతులకు నలుగురు పిల్లలున్నారు. 

నాలుగో బాబు వయస్సు 45రోజులు. కాగా పెళ్లయిన ఏడాది నుంచే భార్యను వేధింపులకు గురిచేయడమే కాకుండా కట్నం తీసుకురావాలంటూ పలుమార్లు చితకబాదాడు. దీనికితోడు భార్యపై అనుమానం పెంచుకుని సూటిపోటి మాటలతో చిత్రహింసలు పెట్టాడు. దీంతో రెండేళ్ల కిందట పుట్టింటికి వెళ్లిన అనిత పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించింది. వారు మందలించడంతో పద్ధతి మార్చుకుంటానని భార్యను కాపురానికి తెచ్చుకున్నాడు. కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఇదే రీతిన భార్యను హింసకు గురిచేస్తున్నాడు.  ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో భరోసా సెంటర్‌లో కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చారు. 

అయినప్పటికీ రోజూ మద్యం తాగొచ్చి భార్యపై చేయిచేసుకుంటున్నాడు. ఇదిలా ఉండగా.. శనివారం రాత్రి కూడా భార్యను విపరీతంగా కొట్టడంతో పాటు ఎలక్ట్రిక్‌ హీటర్‌తో విచక్షణా రహితంగా దాడి చేశాడు. దీంతో అనిత అక్కడకక్కడే మృతి చెందింది. అనంతరం అనిల్‌ అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో బంజారాహిల్స్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. నిందితుడు అనిల్‌పై హత్యా నేరం కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


logo