మంగళవారం 27 అక్టోబర్ 2020
Crime - Sep 27, 2020 , 17:15:13

ఖరీదైన వాచీల అక్రమ రవాణా : నలుగురు అరెస్ట్‌

ఖరీదైన వాచీల అక్రమ రవాణా : నలుగురు అరెస్ట్‌

న్యూఢిల్లీ : లగ్జరీ గడియారాల అక్రమ రవాణాపై కస్టమ్స్ విభాగం ఢిల్లీ అంతర్జాతీయ విమానాశ్రయంపై దృష్టిసారించింది. పెద్ద ఎత్తున ఖరీదైన వాచీలను రవాణా చేస్తున్న పలువురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.2.89 కోట్ల విలువ చేసే 33 గడియారాలను స్వాధీనం చేసుకున్నారు. 

దేశ రాజధానిలోని పెద్ద షోరూమ్‌లు ఎటువంటి దిగుమతి సుంకం చెల్లించకుండా గడియారాలు తీసుకురావడానికి భారీ కమీషన్ చెల్లిస్తుండటంతో పలువురు అక్రమ రవాణాకు పూనుకుంటున్నారు. విదేశాల నుంచి ఖరీదైన గడియారాల అక్రమ రవాణా జోరుగా సాగుతుండటంతో కస్టమ్స్ విభాగం అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ నెల 24న ఇందిరాగాందీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దుబాయ్‌ నుంచి వచ్చిన ఇద్దరు వ్యక్తులను అరెస్ట్‌చేసి  వారి నుంచి రూ.51.55 లక్షల విలువ చేసే నాలుగు గడియారాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో కూడా వీరు రూ.1.40 కోట్ల విలువైన గడియారాలను అక్రమంగా రవాణా చేసినట్లు విచారణలో అంగీకరించారు. వీరిచ్చిన సమాచారం మేరకు విదేశీ  బ్రాండెడ్‌ వాచులు విక్రయించే ఒక సంస్థపై దాడి చేసిన కస్టమ్స్‌ అధికారులు అక్కడ 33 హై ఎండ్‌ గడియారాలను పట్టుకున్నారు. వీటి విలువ రూ.2.89 కోట్ల వరకు ఉంటుందని అధికారులు చెప్తున్నారు. ఖరీదైన విదేశీ గడియారాలను చట్టవిరుద్ధంగా దిగుమతి చేసుకుంటున్న వారిలో ఇద్దరు ఒక కంపెనీ డైరెక్టర్లుగా ఉన్నారని దర్యాప్తులో తేలింది. ఇద్దరు ప్రయాణికుల నుండి రూ.2.5 కోట్ల విలువైన గడియారాలను కొనుగోలు చేసినట్లు కస్టమ్స్ అధికారుల విచారణలో వీరిద్దరు అంగీకరించారు. ఒక్కో వాచీ విలువ రూ.10 లక్షల వరకు ఉంటుందని అధికారులు అంచనావేస్తున్నారు.


logo