శనివారం 19 సెప్టెంబర్ 2020
Crime - Jun 17, 2020 , 17:05:10

చేపలకూరకు కక్కుర్తి.. అడ్డంగా బుక్కైన దొంగ

చేపలకూరకు కక్కుర్తి.. అడ్డంగా బుక్కైన దొంగ

కన్యాకుమారి: దొంగతనానికి వచ్చిన వాడు పని చక్కబెట్టుకొని వెళ్లకుండా వంటింట్లో కమ్మటి చేపలకూర వాసన రావడంతో కక్కుర్తిపడి అడ్డంగా బుక్కయ్యాడు. జనాల చేతికి చిక్కి తన్నులు తిన్నాడు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగింది. సతీస్ అనే దొంగ ఓ ఇంట్లో దొంగతనం చేయటానికి వెళ్లాడు. ఇల్లంతా కలియదిరిగి ఏయే వస్తువులు ఎత్తుకెళ్లాలో చూశాడు. అయితే విలువైన వస్తువులేవీ కనిపించకపోవడంతో ఎందుకొచ్చానురా బాబోయ్‌ అని తిట్టుకొంటూ బైటకు నడిచాడు. 

ఇంతలో వంటింట్లో నుంచి చేపలపులుసు కమ్మటి వాసన ఈ దొంగగారి ముక్కుపుటాలను ఆదరగొట్టాయి. ఇంకేం.. నిమిషం ఆలస్యం చేయకుండా వంటింట్లోకి దూరిపోయి కడుపు నిండా లాగించేశాడు. అనంతరం మేడపైకి వెళ్లగానే నిద్ర ముంచుకొచ్చింది. చల్లటి గాలికి హాయిగా నిద్రపోయాడు. తెల్లారి బారెడు పొద్దెక్కినా మెలకువరాకపోగా మరింత గురక పెట్టి పడుకొన్నాడు. ఇంట్లో వస్తువులన్నీ చిందరవందరగా ఉండటం చూసిన ఇంటి యజమాని.. దొంగతనం జరిగిందని భావించి తన ఇంట్లోని సీసీ కెమెరా ఫీడ్‌ చూసి ఆశ్చర్యపోయాడు. చేపల కూరంతా తినేసి మేడ మీదకెళ్లి హాయిగా గురక పెట్టి నిద్రపోతున్న దొంగను చూసి షాకయ్యారు. పైకి వెళ్లి చూడగా అప్పటికీ అక్కడే నిద్ర పోతూ కనిపించాడు. ఇరుగుపొరుగు తట్టిలేపి అనంతరం దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. గత రెండురోజులుగా ఇదే  దొంగ కోసం  పోలీసులు కళ్లల్లో  వత్తులు వేసుకొని మరీ గాలిస్తుండగా.. చేపలకూర దొంగను పట్టించడం వార్త విని కన్యాకుమారిలో అంతా నోరెళ్లబెడుతున్నారంట. 


logo