సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jul 30, 2020 , 17:56:26

మార్కుల బెంగ‌తో కాదు.. మృగాల వేధింపుల‌తో..

మార్కుల బెంగ‌తో కాదు.. మృగాల వేధింపుల‌తో..

భోపాల్ : ఓ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ప‌రీక్షా ఫ‌లితాల రోజే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డంతో మార్కుల బెంగ‌తో అనుకున్నారు కుటుంబ స‌భ్యులు. కానీ ఆమె మృగాల వేధింపుల‌తో ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు త‌ర్వాత తెలిసింది. ఈ విషాద ఘ‌ట‌న మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని ఇండోర్‌లో జులై 27న చోటు చేసుకోగా ఆల‌స్యంగా వెలుగు చూసింది. 

ఇండోర్‌కు చెందిన ఓ 19 ఏళ్ల బాలిక 12వ త‌ర‌గ‌తి చ‌దువుతోంది. ఈ నెల 27న 12వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫ‌లితాలు మ‌ధ్యాహ్నం విడుద‌ల‌య్యాయి. ఆ బాలిక పొద్దున్నే ఇంట్లో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. మార్కులు త‌క్కువ వ‌స్తాయ‌నే కార‌ణంతో ఆత్మ‌హ‌త్య చేసుకుని ఉండొచ్చు అని కుటుంబ స‌భ్యులు భావించారు. కానీ మ‌ధ్యాహ్నం విడుద‌లైన ఫ‌లితాల్లో ఆమె 74 శాతం మార్కులు సాధించి ప్ర‌థ‌మ శ్రేణిలో ఉత్తీర్ణ‌త పొందింది. 

ఇక్క‌డే అస‌లు అనుమానం మొద‌లైంది బాలిక సోద‌రుడికి. త‌న చెల్లి ఆత్మ‌హ‌త్య‌కు గ‌ల కార‌ణాల‌పై అన్న దృష్టి సారించాడు. ఇంటికి స‌మీపంలో ఉన్న ఇద్ద‌రు యువ‌కుల వేధింపుల వ‌ల్లే ఆమె ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ట్లు సోద‌రుడికి తెలిసింది. ఆత్మ‌హ‌త్య‌కు ఒక రోజు ముందు.. ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో బాలిక వ‌ద్ద‌కు ఇద్ద‌రు యువ‌కులు వ‌చ్చారు. త‌న‌ను పెళ్లి చేసుకోక‌పోతే తీవ్ర‌మైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని, కుటుంబాన్ని చంపేస్తాన‌ని బెదిరించాడు. దీంతో తీవ్ర మ‌న‌స్తాపానికి గురైన బాలిక ఆత్మ‌హ‌త్య చేసుకుంది.

చెల్లి ఆత్మ‌హ‌త్య‌పై సోద‌రుడు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టారు. నిందితుల‌ను స‌న్నీ, బియ్యుగా పోలీసులు గుర్తించారు. వీరిద్ద‌రికి నేర చ‌రిత్ర ఉన్న‌ట్లు పోలీసుల విచార‌ణ‌లో తేలింది.


logo