శనివారం 16 జనవరి 2021
Crime - Oct 07, 2020 , 20:04:07

వాహ‌న త‌నిఖీల్లో భారీగా బంగారం, వెండి ఆభ‌ర‌ణాల‌ ప‌ట్టివేత‌

వాహ‌న త‌నిఖీల్లో భారీగా బంగారం, వెండి ఆభ‌ర‌ణాల‌ ప‌ట్టివేత‌

భద్రాద్రి కొత్తగూడెం : వాహ‌న త‌నిఖీల్లో భారీగా బంగారు, వెండి ఆభ‌ర‌ణాలు ప‌ట్టుబ‌డ్డాయి. ఈ ఘ‌ట‌న భ‌ద్రాద్రి కొత్త‌గూడెం జిల్లాలో చోటుచేసుకుంది. పాల్వంచ పట్టణ సీఐ సత్యనారాయణ,  ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి అంబేద్కర్ సెంటర్ వ‌ద్ద బుధ‌వారం వాహన తనిఖీలు చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా స్కూటీపై ఒక సంచితో అనుమానాస్పదంగా వస్తున్న‌వారిని ఆపి త‌నిఖీలు చేశారు. సంచిని తనిఖీ చేయగా అందులో బంగారు మరియు వెండి వస్తువులను గుర్తించడం జరిగింది. నిందితులను  పూసపాటి శ్రీనివాస్ అలియాస్ సిండికేట్ శ్రీను, ఐనాల కృష్ణగా గుర్తించారు. శ్రీ‌నివాస్ 14 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. వీరంతా విలాస‌వంత‌మైన జీవితానికి అల‌వాటుప‌డి చోరీల బాట ప‌ట్టిన‌ట్లుగా పోలీసులు వెల్ల‌డించారు. నిందితుల వ‌ద్ద నుంచి 575 గ్రాముల బంగారు వ‌స్తువులు, 4.5 కేజీల వెండి వస్తువులు, ఒక గ్యాస్ సిలిండర్,సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. ప‌ట్టుబ‌డ్డ సొత్తు విలువ సుమారు 19 ల‌క్ష‌లుగా స‌మాచారం. ఇద్దరు నేరస్తులను చాకచక్యంగా పట్టుకున్న సీఐ సత్యనారాయణ, ఎస్ఐ ప్రవీణ్, కానిస్టేబుళ్ళు లక్ష్మణ్, ప్రసాద్, హోంగార్డు రవిలను డిఎస్పీ అభినందించారు.