లక్నో : యూపీలో మహిళలు, బాలికలపై లైంగిక దాడుల ఘటనలకు బ్రేక్ పడటం లేదు. ముజఫర్నగర్ సమీపంలోని భోపా పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో ఇద్దరు నిందితులు యువతి(17)పై ఆదివారం సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. వీరు నేరాన్ని వీడియోలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ దారుణం వెలుగుచూసింది.
శుభం, ఆశిష్ అనే నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న వారి కోసం గాలింపు తీవ్రతరం చేశారు. బాలికకు జామ పండ్లు ఇస్తామని ఆశ చూపి ఆమెను తోటలోకి తీసుకువెళ్లిన నిందితులు దారుణానికి ఒడిగట్టారని బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోషల్ మీడియాలో వీడియో వైరల్ కావడంతో ఈ ఘటన వెలుగుచూసిందని పోలీసులు తెలిపారు. ఇక కొత్వాలి పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామంలో జరిగిన మరో ఘటనలో పొలంలో ఒంటరిగా ఉన్న మహిళపై ఓ వ్యక్తి లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడని ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.