శనివారం 05 డిసెంబర్ 2020
Crime - Oct 24, 2020 , 15:08:41

ప్రియుడ్ని పెళ్లాడతానన్న చెల్లిని హత్యచేసిన అన్న

ప్రియుడ్ని పెళ్లాడతానన్న చెల్లిని హత్యచేసిన అన్న

జైపూర్‌: ప్రేమించిన వ్యక్తినే పెళ్లాడతానన్న చెల్లిని ఒక అన్న హత్య చేశాడు. రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. భివాడి నగర సమీపంలోని సంతల్క గ్రామానికి చెందిన 24 ఏండ్ల పవన్‌ ఏసీ రిపేర్‌ షాపు నిర్వహిస్తున్నాడు. విష్ణు అనే వ్యక్తి అతడి వద్ద పని చేస్తున్నాడు. ఈక్రమంలో పవన్‌ చెల్లి, విష్ణు మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. అతడు కూడా ఆమె కులానికి చెందినవాడే కావడంతో వారిద్దరు పెండ్లి చేసుకోవాలని భావించారు. అయితే యువతి కుటుంబ సభ్యులు దీనికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో పవన్‌ వద్ద విష్ణు పనిమానివేశాడు. మరోవైపు ఆ యువతికి కుటుంబ సభ్యులు పెండ్లి సంబంధాలు చూస్తున్నారు. అయితే తాను విష్ణునే పెండ్లి చేసుకుంటానంటూ ఆమె మెండికేసింది. 

మరోవైపు పవన్‌ తల్లిదండ్రులు గురువారం బయటకు వెళ్లారు. ఆ రాత్రి పవన్‌, చెల్లి మధ్య విష్ణు ప్రస్తావన వచ్చింది. అతడ్ని తప్ప మరొకరిని పెండ్లి చేసుకోనని ఆమె చెప్పింది. దీంతో ఆగ్రహంతో చెల్లి తలను నేలకేసి పలుసార్లు కొట్టాడు. దీంతో శుక్రవారం తెల్లవారుజామున ఆమె చనిపోయింది. పవన్‌ తన తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి ఈ విషయాన్ని చెప్పాడు. అయితే వారు దీనిని నమ్మలేకపోయారు. మరోవైపు పాలవ్యక్తి ఈ విషయాన్ని గ్రహించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. దీంతో పోలీసులు ఆ గ్రామానికి వచ్చి పవన్‌ను అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.