శుక్రవారం 04 డిసెంబర్ 2020
Crime - Oct 19, 2020 , 22:02:13

పెండ్లి చేసుకోమన్నందుకు కడతేర్చిన వైద్యుడు

పెండ్లి చేసుకోమన్నందుకు కడతేర్చిన వైద్యుడు

ఘజియాబాద్ : ఒక వైద్యుడు తన వద్దకు వచ్చే మహిళ రోగితో డేటింగ్ చేసి చివరకు తనతో కలిసి ఉండాలని గట్టిగా పట్టుబట్టినందుకు ఆ మహిళను దారుణంగా హత్య చేశాడు. డాక్టర్‌గా తనకున్న ఔషధాల విజ్ఞానంతో క్లూస్‌ దొరకకుండా ఉండేంత స్మూత్‌గా ఆమెను చంపి అనంతరం కురుక్షేత్రలోని ఓ పొలంలో పడేసి వెళ్లిపోయాడు. తన భార్య తప్పిపోయిందంటూ ఆమె భర్త ఘజియాబాద్‌ పోలీసులకు ఫిర్యాదుతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులకు కురుక్షేత్రలో దొరికిన మృతదేహంతో వైద్యుడి అసలు రూపం బయటపడింది. 

ఘజియాబాద్‌కు చెందిన 33 ఏళ్ల వైద్యుడు ఇస్మాయిల్‌.. గత ఐదేండ్లుగా దాస్నాలో క్లినిక్‌ నడుపుతున్నాడు. కొన్ని నెలల క్రితం తన వద్దకు వచ్చిన ఒక మహిళారోగితో ప్రేమలో పడ్డాడు. ఇద్దరికీ పెండ్లిండ్లు అయ్యాయి. మహిళకు నలుగురు పిల్లలు కూడా ఉన్నారు. ఆ మహిళ తనతో సహజీవం చేయాలంటూ, పెండ్లి చేసుకోవాలంటూ ఒత్తిడి తేవడంతో ఆమెను తప్పించేందుకు ఇస్మాయిల్ పథకం వేశాడు. కాగా, సెప్టెంబర్‌ 7వ తేదీన తన భార్య కనిపించడం లేదంటూ సదరు మహిళ ఘజియాబాద్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. అక్కడి పోలీసులు రాష్ట్రం, జిల్లాలోని అన్ని పోలీస్‌ స్టేషన్లకు సమాచారం అందించారు. నెల రోజుల తర్వాత కురుక్షేత్రలో బయటపడిన మహిళ మృతదేహాన్ని తప్పిపోయిన ఘజియాబాద్‌ మహిళదిగా పోలీసులు గుర్తించారు. పోలీసులు ఆమె మొబైల్‌ కాల్ రికార్డులను తనిఖీ చేసి.. ఇస్మాయిల్‌పై అనుమానం పెంచుకున్నారు. విచారణ సమయంలో మహిళను తానే హత్య చేసినట్లు ఇస్మాయిల్‌ ఒప్పుకున్నాడు. సెప్టెంబర్ 7 న మహిళను తన బైక్‌పై పహర్‌గంజ్‌లోని ఒక హోటల్‌కు తీసుకెళ్లాడు. మరుసటి రోజు కారు అద్దెకు తీసుకొని వచ్చి చండీగఢ్‌కు వెళ్తున్నానని చెప్పడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. సదరు మహిళ అప్పటికే ఉబ్బసం వ్యాధితో బాధపడుతున్నందున.. ఆమెకు ఔషధాలను మరో డ్రగ్‌తో కలిపి ఇంజెక్ట్‌ చేశాడు. స్పృహ తప్పిపడిపోయిన ఆమెను టవల్‌తో గొంతునులిమి చంపేశాడు. అనంతరం మృతదేహాన్ని కారులో వేసుకుని వెళ్లి కురుక్షేత్రకు సమీపంలోని పొలాల్లో పడేసి వెళ్లిపోయాడు. నిందితుడు ఇస్మాయిల్‌పై భారతీయ శిక్షా స్మృతి ప్రకారం కేసు నమోదు చేసి ఘజియాబాద్‌ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.