ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో పలు దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. విశాఖ, విజయనగరం జిల్లాల్లో ఆలయాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠా 27 ఆలయాల్లో ఇటీవల కాలంలో నేరాలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. మధురవాడ వాంబే కాలనీకి చెందిన మొగిలిపల్లి నాగార్జున... తోట వీరబాబు, మరుపల్లి ధనరాజుతో సహా ఆరుగురు ముఠాగా ఏర్పడి ఆలయాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. ముఠా సభ్యులు ఒకరికి ఆటో ఉండడంతో ఆటోలో తిరుగుతూ నేరాలు చేయడం వీరికి అలవాటుగా మారింది.
తాజాగా విజయనగరం జిల్లాలో వరుసగా ఆలయాల్లో హుండీలు పగలగొట్టిన ఈ నేరస్థులను విజయనగరం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటీవల ఆలయాల్లో జరిగే సంఘటన ఆధారంగా కొందరు రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని విశాఖ రేంజ్ డీఐజీ కాళిదాసు రంగారావు పేర్కొన్నారు. ఇలాంటి అవాస్తవాలను నమ్మవద్దని ఆలయాల్లో చోరీలు జరిగితే ప్రజలు మత విద్వేషాలకు లోను కావొద్దని కోరారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.