సోమవారం 13 జూలై 2020
Crime - May 18, 2020 , 02:09:14

లోన్ పేరుతో మోసం...

లోన్ పేరుతో మోసం...

హైదరాబాద్ :  బజాజ్‌ ఫైనాన్స్‌ నుంచి వ్యక్తిగతంగా రూ. 5 లక్షల రుణాన్ని మంజూరు చేస్తామంటూ నమ్మించి సైబర్‌నేరగాళ్లు ఓ వ్యాపారికి రూ. 1.16 లక్షలు టోకరా వేశారు. పోలీసుల కథనం ప్రకారం.. దూల్‌పేట్‌కు చెందిన ఠాకూర్‌ అభిషేక్‌సింగ్‌కు సైబర్‌నేరగాళ్లు తాము బజాజ్‌ ఫైనాన్స్‌ సంస్థ నుంచి మాట్లాడుతున్నామంటూ ఫోన్‌ చేసి నమ్మించారు. మీకు వ్యక్తిగతలోన్‌ ఇస్తామంటూ అతడికి రెండుమూడు సార్లు ఫోన్‌ చేశారు. వాళ్ల మాటలు నమ్మిన అభిషేక్‌ వారు అడిగిన డాక్యుమెంట్లను పంపించాడు. ఆ తరువాత రిజిస్ట్రేషన్‌ఫ్రీ, జీఎస్టీ, ఆదాయపన్ను, సెక్యూరిటీ డిపాజిట్‌ అంటూ రూ. 1.16 లక్షలు వసూలు చేశారు. రూ. 5 లక్షలు రుణానికి ఇంత డబ్బు ఎందుకు చెల్లించాలంటూ బాధితుడు ప్రశ్నించడంతో రిజిస్ట్రేషన్‌ ఫ్రీ తప్ప మిగతావన్నీ తిరిగి వాపస్‌ వస్తాయంటూ నమ్మించారు, ఇంకా డబ్బు అడుగుతుండడంతో ఇదంతా మోసమని గ్రహించిన బాధితుడు సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

మరో ఘటనలో ఇండియామార్ట్‌ నుంచి  అన్వర్‌ రూ.1.5 లక్షల విలువైన బట్టలను వ్యాపారం కోసం కొన్నాడు. ఆన్‌లైన్‌లో ఇచ్చిన ఆర్డర్‌కు, డెలివరీ అయిన బట్టలకు తేడా ఉండడంతో వాటిని తిరిగి సదరు దుకాణానికి పంపించాడు. అయితే మరో దఫా బట్టలు  పంపించడం కానీ, చెల్లించిన డబ్బు తిరిగి ఇవ్వకపోవడంతో తనను సైబర్‌నేరగాళ్లు మోసం చేశారంటూ ఆదివారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.


logo