సోమవారం 21 సెప్టెంబర్ 2020
Crime - Jun 20, 2020 , 17:53:14

యూపీలో వ‌రుస ప్ర‌మాదాలు.. 9 మంది మృతి

యూపీలో వ‌రుస ప్ర‌మాదాలు.. 9 మంది మృతి

ల‌క్నో : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లోని య‌మునా, ఆగ్రా - ల‌క్నో ఎక్స్ ప్రెస్ వేపై వ‌రుస‌గా నాలుగు రోడ్డుప్ర‌మాదాలు జ‌రిగాయి. ఈ ప్ర‌మాదాల్లో 9 మంది ప్రాణాలు కోల్పోగా, మ‌రో 9 మంది తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 

మొద‌టి ప్ర‌మాదం.. య‌మునా ఎక్స్ ప్రెస్ వేపై నిన్న మ‌ధ్యాహ్నం 3 గంట‌ల స‌మ‌యంలో సంభ‌వించింది. మ‌ధురలోని య‌మ‌న్ పార్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో వేగంగా వెళ్తున్న కారు.. గుర్తు తెలియ‌ని వాహ‌నాన్ని ఢీకొట్టింది. ఈ ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెంద‌గా, ఒక‌రు గాయ‌ప‌డ్డారు.

ఆగ్రా - ల‌క్నో ఎక్స్ ప్రెస్ వేపై శ‌నివారం తెల్ల‌వారుజామున 5:30 గంట‌ల‌కు మ‌రో ప్ర‌మాదం జ‌రిగింది. ఫిరోజాబాద్ జిల్లాలోని నాసిర్ పూర్ పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో కారు.. ట్ర‌క్కును ఢీకొట్టింది. దీంతో కారులో ప్ర‌యాణిస్తున్న ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మ‌రో ఇద్ద‌రికి తీవ్ర గాయాల‌య్యాయి.

ఆగ్రాలోని ఫ‌తేబాద్ పోలీసు లిమిట్స్ లో ఎస్ యూ వీ - ట్ర‌క్కును ఢీకొన‌డంతో ఒక‌రు ప్రాణాలు విడిచారు. నాలుగో ప్ర‌మాదం మెయిన్ పురి జిల్లాలోని కుర్రా పోలీసు స్టేష‌న్ ప‌రిధిలో చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న కారు అదుపుత‌ప్పి డివైడ‌ర్ ను ఢీకొట్టి బోల్తా ప‌డింది. ఈ ప్ర‌మాదంలో ఆరుగురు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. 

ఈ వేర్వేరు ప్ర‌మాద ఘ‌ట‌న‌ల‌పై పోలీసులు కేసులు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు. మృతదేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు. క్ష‌త‌గాత్రుల‌ను చికిత్స నిమిత్తం స‌మీప ఆస్ప‌త్రుల‌కు త‌ర‌లించారు. డ్రైవ‌ర్లంద‌రూ నిద్ర మ‌త్తులో ఉండ‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదాలు సంభ‌వించిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా నిర్ధారించారు.


logo